మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు టార్చర్ అనుభవించి తన రిటైర్మెంట్ రోజున పోస్టింగ్ పొందారు. అదే రోజు రిటైరయ్యారు. తనను టార్చర్ పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన చెబుతూ వస్తున్నారు. తన గురించి జగన్ ఏదైనా సందర్భంలో ప్రస్తావిస్తే సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచి జగన్ నుంచి ఏపీని కాపాడుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఆయన హఠాత్తుగా అమలాపురంలో ప్రెస్ మీట్ పెట్టి.. తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటించేశారు.
ఇటీవల ప్రభుత్వం ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. అది ఆయనకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలు ఆయన తీసుకున్నారో లేదో స్పష్టత లేదు. కానీ ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఆయన ఆ కార్పొరేషన్ కార్యాలయం వైపు పోలేదు. అదే సమయంలో పదవిని తిరస్కరించినట్లుగా కూడా చెప్పలేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నా అంటున్నారు కాబట్టి అధికారికంగా టీడీపీలో చేరి.. ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకుంటారా.. తన హోదాకు చాలా తక్కువ పదవి కాబట్టి తిరస్కరిస్తారో చూడాల్సి ఉంది.
ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు వివిధ సమావేశాలకు హాజరై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతున్నారు. ముఖ్యంగా కమ్మ కులం నేతలు, ప్రజలు ఎలాంటి వివక్షకు గురవుతున్నారో ఆయన నేరుగా చెబుతున్నారు. జగన్ రెడ్డి లాంటి వాళ్లు ఎలా కులాన్ని టార్గెట్ చేశారో.. టీడీపీ కూడా.. కమ్మ కులం వాళ్లకు అండగా ఉంటే.. . కులం ముద్ర వేస్తారని ఎలా పట్టించుకోరో చెప్పారు. ఇప్పుడు ఆయన రాజకీయ పయనం ఎలా ఉంటుందో కానీ నిర్మోహమాటంగా మాట్లాడే నేతగా .. వివాదాల్లో ఉంటారని అనుకోవచ్చు.