డీజీపీ ర్యాంక్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు… కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముందు విచారణకు హాజరైన తర్వాత మీడియా ముఖంగా కొన్ని సంచనల ఆరోపణలు చేశారు. అవేమిటంటే.. చట్టాన్ని పరిరక్షించాల్సిన ఐపీఎస్ అధికారులే తనపై కుట్ర చేసి.. తప్పుడు ఫైల్స్.. కృత్రిమ సాక్ష్యాలు పుట్టించే ప్రయత్నం చేశారట. దానికి సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని… తన కేసు తేలిపోయినా..వాటి గురించి మాత్రం వదిలి పెట్టబోనని ఆయన అంటున్నారు. కుట్ర పన్ని తనను ఇరికించేందుకు తయారు చేసిన కృత్రిమ డాక్యుమెంట్ల విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని… కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్కు కూడా ఈ విషయం చెప్పానన్నారు. ఈ విషయంపై వాస్తవాలు వెల్లడయ్యే వరకూ పోరాటం చేస్తానని ప్రకటించారు.
ఏబీవీ వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాల విషయంలో ఏపీలోని ఇతర ఐపీఎస్ అధికారుల తీరు కూడా వివాదాస్పదమయింది. తోటి ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం టార్గెట్ చేసిందని స్పష్టంగా తెలిసినప్పటికీ.. వారు ప్రభుత్వానికి సహకారం అందించారనే ప్రచారం చాలా రోజులుగా ఉంది.అయితే.. ఏబీవీని ఇరికించడానికి ఏకంగా తమ ఐపీఎస్ తెలివి తేటల్ని.. సీనియార్టీని … కృత్రిమ ఫైల్స్ సృష్టించడానికి… జరగని వ్యవహారాలను జరిగినట్లుగా చూపించడానికి ప్రయత్నించారన్న ఆరోపణలే ఇప్పుడు కీలకం అవుతున్నాయి. నిజంగా ఐపీఎస్‌లు… చట్టాలను పరిరక్షించే విషయంలో శిక్షణ పొంది… సుదీర్ఘ సర్వీస్ ఉన్న అధికారులు అలాంటి పనులు చేస్తారా.. అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది.
ఏబీ వెంకటేశ్వరరావుపై జరిగిన ప్రచారం వేరు.. ఇప్పుడు జరుగుతున్న విచారణ వేరు. రూ. పది లక్షల నష్టం చేశారనేది ఫైనల్‌గా నమోదు చేస్తున్న అభియోగం.కానీ ఆయనపై దేశద్రోహం సహా.. చాలా ఆరోపణలు చేశారు. అయితే అవన్నీ సీపీఆర్వో నుంచి సర్క్యూలేట్ అయ్యాయి.. కానీ సంబంధం లేదన్నట్లుగా ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.దీంతో ఏబీ వెంకటేశ్వరరావు తన హక్కులకు భంగం కలిగినట్లుగా భావిస్తున్నారు. ఉన్నత స్థాయిలో జరిగిన కుట్రగా నమ్మి ఆయన ఈ వ్యవహారాన్ని లెక్క తేల్చాలనుకుంటున్నారు. తన కేసుపై విచారణను కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ పూర్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది. ఆ తర్వాత ఏబీవీ తనపై జరిగిన కుట్రను చేధించేందుకు పూర్తి సమయం వెచ్చిస్తారని భావిస్తున్నారు.