ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు మరోసారి మీడియా ముందుకు వస్తున్నారు. సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. కీలక విషయాలు వెల్లడించబోతున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. పెగాసస్ అంశంలో ఆయన పేరు కూడా ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీంతో ఆయనమీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు బయట పెట్టాలని అనుకుంటున్నారు. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఆయనపై వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత అనేక రకాల కేసులు నమోదు చేశారు.
ఆయన రిటైర్మెంట్ అయ్యారో లేదో కూడాతెలియదు. ఆయనను సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. అదేమయిందో కూడా స్పష్టత లేదు. కొన్ని రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న ఆయన.. ప్రభుత్వం మరోసారి తనపై ఆరోపణలు చేయడంతో మీడియా సమావేశం పెట్టాలని నిర్ణయించుకున్నారు. పెగాసస్ అంశంలో చంద్రబాబు ప్రభుత్వం సాఫ్ట్వేర్ కొన్నారో లేదో చెప్పడానికి ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా పట్టదు.
అయినప్పటికీ.. కొన్నారో లేదో విచారణ చేయాలంటూ హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు.. ఏబీవీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో ఏబీవీ బయట పెట్టనున్న అంశాలు కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెగాసస్ అంశాన్ని సుప్రీంకోర్టు కమిటీ విచారణ జరుపుతోంది.