వివేకా హత్య కేసు విషయంలో ఏపీ సర్కార్ అసహనంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ కేసు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సీబీఐకి ఆధారాలిస్తామని లేఖ రాశారని.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా …సెలవు రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.. జీవో విడుదల చేశారు. అఖిల భారత సర్వీసు నిబంధన 8 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తూ.. విచారణకు సంబంధించిన అనేక అంశాలను బహిరంగం చేశారని ఆరోపించారు. 30 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
ఏబీ ఎలాంటి వివరణ ఇచ్చినా.. ముప్ఫై రోజుల తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన తన సస్పెన్షన్పై న్యాయపోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇంత కాలం సస్పెన్షన్లో ఉంచుతారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయనపై ఉన్న అభియోగాలపై రోజువారీ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విచారణ పూర్తి చేసింది. నివేదిక సమర్పించాల్సి ఉంది. ఆ నివేదిక సమర్పించిన తర్వాత ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. అప్పుడు ఏపీ సర్కార్కు మరో అవకాశం లభించినట్లవుతుంది.
ఈ క్రమశిక్షణా చర్యల పేరుతో ఆయనపై మళ్లీ సస్పెన్షన్ వేటు వేయడానికి అవకాశం తెచ్చి పెట్టుకుందని అంటున్నారు. అప్పుడు మళ్లీ ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది. ఇలా ఏబీని ఇక సర్వీసు పూర్తయ్యే వరకూ వివిధ రకాల సస్పెన్షన్లలో ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పూర్తిగా తెలుగుదేశం మనిషి అని నమ్ముతున్న ఏపీ సర్కార్.. ఆయనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవడానికి ఏ మాత్రం సుముఖంగా లేదు. అందుకే.. ఒకదాని తర్వాత ఒకటి అభియోగాలు మోపి.. క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు వ్యూహం సిద్ధం చేసుకుందని అంటున్నారు.