డీజీ స్థాయి అధికారిపై తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా చివరికి ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి వచ్చంది. తనపై నమోదు చేసినవన్నీ తప్పుడు కేసులేనని కొట్టి వేయాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణలో ప్రభుత్వ లాయర్ వాదన విచిత్రంగా సాగింది. నేరం చేశారని ఆయన చెప్పలేదు. ఏబీవీ చేసిన నేరం ఏమిటంటే.. నిఘా పరికరాల కొనుగోలుకు ఆసక్తి చూపడం… ఆయన కుమారుడి సంస్థకు లబ్ది చేకూర్చేందుకు ఉత్సాహం చూపించడట.
అసలు నిఘా పరికరాలే కొనలేదు .. అవినీతి ఎక్కడ ఉందని ఏబీవీ వాదిస్తున్నారు. అసలు ఏసీబీ చార్జిషీటే వేయలేదన్నారు. దీనిలాయర్ ఇచ్చిన సమాధానం.. అవినీతి చేయాలని ఆసక్తి కనబర్చడం కూడా నేరమేనని. ఈ ఆసక్తిని ఎలా నిరూపిస్తారో కానీ.. హైకోర్టులో మాత్రం ప్రభుత్వం తీరు బయటపడిపోయింది. నిఘా పరికరాల కొనుగోలు అనేది ఒక్కరి చేతిలో ఉండదు. కమిటీ ఉంటుంది. అందులో ఏబీవీ పాత్రలేదని పలుమార్లు ఆయనే ప్రకటించారు. కానీ ఆసక్తి చూపించారని అది నేరమేనని ఏజీ వాదించారు. అదే సమయంలో ఆయన తన కుమారుడి సంస్థకు మేలు చేశారని.. ఇన్ని కోట్ల రూపాయలు లబ్దిపొందేలా చేశారని చెప్పలేదు. ఆయన కుమారుడి సంస్థకు మేలు చేసేందుకు ఉత్సాహం చూపించారని వాదించారు.
ఈ కేసు వ్యవహారంలో ప్రభుత్వ వాదనలు చూస్తే.. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసుల్లో పెట్టి వేధించినట్లుగా తేలుతుందన్న వాదన వినిపిస్తుంది. ప్రభుత్వం ప్రచారం చేసిన.. నమోదు చేసిన కేసుల్లో వాస్తవాలు లేకుండా.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులంతా తీవ్రంగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే డీజీపీ స్థాయి అధికారికే తప్పుడు కేసులతో ఇంత ఇబ్బంది పెట్టారంటే.. దానికి పై స్థాయి అధికారుల సహకారం ఉండే ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఏబీవీ కేసులో మాజీ డీజీపీ సవాంగ్ ఏకంగా ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముందు ముందు ఇవి ఏపీ అధికారవర్గాల్లో సంచలనం అయ్యే చాన్సులు కనిపిస్తున్నాయి.
ఏబీవీ అవినీతిచేశారని నిరూపించడమే ఇప్పుడు ప్రభుత్వం ముందు ఒకే ఒక చాయిస్. లేకపోతే ఏబీవీ తాను గతంలో హెచ్చరించినట్లుగా.. చర్యల విషయంలో పోరాడే అవకాశం ఉంది.