మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. సోమవారం సాయంత్రం షిల్లాంగ్ ఐఐఎమ్‌లో జరుగుతున్న ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో వేదికపైనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనని షిల్లాంగ్ లోని బెతేనీ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించినప్పటికీ ఉపయోగంలేకపోయింది. ఆసుపత్రికి వచ్చేసరికే పల్స్కానీ, బీపీకానీ లేవని, కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయారని వైద్యులు నిర్ధారించారు.
అబ్దుల్ కలం పూర్తి పేరు అబ్దుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన అక్టోబర్ 15, 1931సం.లో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ మరియు ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత సుమారు 40సం.ల పాటు ఆయన భారత్ డిఫెన్స్ రీసెర్చ్ లాబ్స్ మరియు భారత అంతరిక్ష శాఖలో సైంటిస్ట్ గా పనిచేసారు. ఆ సమయంలోనే ఆయన అనేక అవిష్కరణలు చేసారు.
భారతదేశానికి బాలిస్టిక్ మిసైల్ మరియు దాని లాంచింగ్ వెహికల్ తయారీలో ఆయన చాలా కీలకమయిన పాతర పోషించారు. ఆ కారణంగానే ఆయనని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరొచ్చింది. భారతదేశ అణుశక్తి గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు 1998స.లో పోక్రాన్ లో జరిపిన అనుప్రయోగంలోను ఆయనే ప్రధాన పాత్ర పోషించారు.
ఆయన అపార మేదస్సు, ప్రతిభాపాటవాలకి గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి గౌరవించాయి. భారత ప్రభుత్వం 1981 సం.లో పద్మ భూషణ్ అవార్డు, 1990 సం.లో పద్మ విభూషణ్ అవార్డు, 1997 సం.లో అత్యంత ప్రతిష్టాత్మకమయిన భారతరత్న అవార్డులతో ఆయనని గౌరవించింది. 2007సం.లో యు.కె.లో వోల్వేర్ హంప్టన్ విశ్వవిద్యాలయం హానరరీ డాక్టరేట్ ఆఫ్ సైన్స్, 2009 సం.లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ‘ఇంటర్నేషనల్ వన్ కర్మాన్ వింగ్స్ అవార్డు’ని, 2014 సం.లో ఎడింబరో విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ సైన్స్ పురస్కారంతో అబ్దుల్ కలాంని గౌరవించాయి.
కలామ్ 2002 సంవత్సరంలో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. నాటి అధికారపక్షం బీజేపీ, ప్రతిపక్షం కాంగ్రెస్ రెండూ ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించాయి. రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన తిరిగి బోధన, రచన, సేవారంగాలలో బిజీ అయ్యారు. తన ప్రసంగాలు, రచనలద్వారా విద్యార్థులను కలామ్ ఎంతగానో ప్రోత్సహించేవారు…ప్రేరణ కల్పించేవారు.