హైదరాబాద్ విజయవాడ రహదారిలో ఒకప్పుడు హయత్ నగర్ శివారు ప్రాంతంగా ఉండేది. ఆ ప్రాంతం దాటితో పెట్టుబడి పేరుతో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం తప్ప.. ఇళ్లు కట్టుకుని ఉండేందుకు అవసరమైన కాలనీలు తక్కువగా ఉండేవి. ఇక ఫిల్మ్ సిటీ హైవే గేటు ఉన్న ప్రాంతం అబ్లుల్లాపూర్ మెట్ అయితే .. అక్కడ ఉండటం కన్నా విజయవాడకు అప్ అండ్ డౌన్ చేయడం మంచిదన్న సెటైర్లు వేసుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అబ్దుల్లాపూర్ మెట్ సిటీలో భాగం అవుతోంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరుగుతున్నాయి.
ఔటర్ రింగ్ దాటిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుంది. ఔటర్ నిర్మాణం పూర్తి అయి చాలా కాలం అయినా డిమాండ్ నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. కానీ ఇటీవలి కాలంలో పుంజుకుంది. కొన్ని బడా నిర్మాణ సంస్థలు అక్కడ స్థలాలను కొనుగోలు చేయడమే కాదు.. చిన్న చిన్న బిల్డర్లు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారు. అపార్టుమెంట్లు, ఇండిపెండెంట్ హౌస్లు నిర్మిస్తున్నారు. కొనుగోలుదారులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. విద్యా, ఉపాది, వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
ఇళ్లు నిర్మాణం అవుతున్న కాలనీల్లో గజం ఇరవై వేలకు లభిస్తోంది. అపార్టుమెంట్లు అయితే ముఫ్పై లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అన్ని సౌకర్యాలతో ఇండిపెండెంట్ హౌస్లు యాభై లక్షలకు అమ్ముతున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా పట్టణీకరణ జరగకపోవడం అబ్దుల్లా పూర్ మెట్ ప్రాంతానికి ప్లస్ అవుతోంది. ధరలు తక్కువగా ఉంటున్నాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో విస్తృతంగా రియల్ ఎస్టేట్ అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయి. ధరలు రెట్టింపు అవుతాయని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.