Abhimanyudu Review, Vishal Irumbu Thirai Movie Review
Rating — 2.75
ఇది వరకు మన ఇంట్లో దొంగ ప్రవేశించాలంటే తాళాలు కావాల్సివచ్చేది. ఇప్పుడలా కాదు. అంతా డిజిటల్ అయిపోయింది. మన ఇంట్లోకేంటి, మన జీవితాల్లోకి మన మనసుల్లోకి ఈజీగా వచ్చేస్తున్నాడు. చెమట చుక్క కూడా వృథా కాకుండా సర్వం దోచుకుని దర్జాగా వెళ్లిపోతున్నాడు. ఇదంతా ‘సైబర్ వార్’ మహత్తు. ప్రపంచాన్ని వణికిస్తున్న మాట…. ‘సైబర్ వార్’. మన కష్టాన్ని కాణీ ఖర్చు లేకుండా జేబులో పెట్టుకుని వెళ్లిపోతున్న వైట్ కాలర్ నేరస్థులు మన చుట్టూ ఉన్నారు. వాళ్లని మన ముందు నిలబెట్టే ప్రయత్నం చేసిన సినిమా ‘అభిమన్యుడు’. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి అడుగుపెట్టడం మాత్రమే తెలుసు. బయటకు రావడం తెలీదు. ‘సైబర్ క్రైమ్’ కూడా అంతే. అందులోంచి బయట పడడం సామాన్యుడికి సాధ్యం కాదు. మరి ఈ ‘అభిమన్యుడు’ సైబర్ వ్యూహాన్ని ఛేదించాడా, లేదా? విశాల్ – అర్జున్‌ల `వార్`లో గెలుపెవరిది?
కథ
కరుణ (విశాల్) ఓ మిలటరీ మేజర్. తన చెల్లాయి పెళ్లి కోసం.. ఊర్లో ఉన్న భూమిని నాలుగు లక్షలకు అమ్మేస్తాడు. మరో ఆరు లక్షలు బ్యాంకులోంచి లోన్‌గా తీసుకుంటాడు. ఈ పది లక్షలు ఒకేసారి ఎకౌంట్లోంచి మాయం అవుతాయి. దానికి కారణం.. ‘సైబర్ క్రైమ్’. ఇది కరుణ సమస్యే కాదు.. దేశం మొత్తమ్మీద ఇలా మోసపోయినవాళ్లెంతమందో? దీనంతటికీ కారణం… వైట్ డెవిల్ (అర్జున్). ప్రజలకు సంబంధించిన సమాచారాన్నంతటినీ తన గుప్పిట్లో పెట్టుకుని.. అమాయకుల్ని దోచుకుంటున్న వైట్ డెవిల్కి పెద్ద నెట్ వర్కే ఉంది. ఆ పద్మవ్యూహంలోకి కరుణ ఎలా వెళ్లాడు? దాన్ని ఎలా ఛేదించాడు? వైట్ డెవిల్‌ని ఎలా అంతమొందించాడు? అనేదే కథ.
విశ్లేషణ
అయితే దర్శకుడు తెలివిగా… విజయ్ మాల్యా, డిజిటల్ ఇండియా లాంటి ఇష్యూల్ని వాడుకున్నాడు. సైబర్ క్రైమ్‌కి సంబంధించిన అంశాలు ఎంత వేడి పుట్టిస్తాయో – విశాల్ ఇంటి వ్యవహారాలు, వ్యక్తి గత జీవితం అంత చప్పగా సాగుతాయి. కథానాయకుడు ఆ స్థాయిలో ప్రతినాయకుడిపై పోరాటానికి దిగాలంటే.. ఈ మాత్రం ఎమోషన్ని చూపించాల్సిందే అని దర్శకుడు భావించి ఉంటాడు. ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. కాకపోతే… డెవిల్ ఆచూకీ తెలుసుకునేంత వరకూ కథకి ఊపు రాదు. ఎప్పుడైతే కరుణ – డెవిల్ ఎదురెదురు పడ్డారో – అప్పుడు మరోసారి ఉత్కంఠత పతాక స్థాయికి చేరుతుంది. అక్కడక్కడ కొన్ని హై పాయింట్స్‌ని దర్శకుడు తెలివిగా వాడుకున్నాడు. డెవిల్ గ్యాంగ్‌ని ట్రాప్ చేయడం, సమంత నోట్లో చిప్ పెట్టడం ద్వారా – విలన్ స్థావరాన్ని తెలుసుకోవడం ఇవన్నీ మంచి హై మూమెంట్స్. బలమైన ప్రతినాయకుడు ఎదురైతే తప్ప… కథానాయకుడిలోని అసలైన హీరోయిజం బయటపడదు. ఈ కథ సక్సెస్ బలమైన ప్రతినాయకుడిలోనే ఉంది. అతన్ని ఢీ కొట్టాలంటే.. బలమైన కథానాయకుడ్ని తయారు చేసుకోవాల్సిందే. అయితే అక్కడక్కడ… అర్జున్ ముందు విశాల్ బలహీనుడిలా కనిపిస్తూ ఉంటాడు. పతాక సన్నివేశాల ముందు వరకూ… ఇదే తంతు సాహింది. ఎప్పుడైతే.. వైట్ డెవిల్ దారిలోనే కరుణ వెళ్లాడో.. అక్కడ అసలైన హీరోయిజం చూసే అవకాశం దక్కుతుంది. సైబర్ మోసాల పై ఈ స్థాయిలో ఓ కమర్షియల్ సినిమా రాలేదు. ఈ కథని చాలా తెలివిగా డీల్ చేశాడు దర్శకుడు. కాకపోతే.. కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు సగటు ప్రేక్షకుడి బుర్రకెక్కవు. అవి కూడా డిజిటల్ సమాచారంలా గందరగోళంగా ఉంటాయి. ‘ఓహో. అలా జరిగిందా, అయితే ఓకే’ అని సర్దుకుపోవాలి. తొలి సగంలో స్లో ఫేజ్నీ, ద్వితీయార్థంలో కాస్త గందరగోళాన్నీ తట్టుకొంటే… ‘అభిమన్యుడు’ నచ్చేస్తాడు.
నటీనటులు
విశాల్ తనకు తగిన పాత్ర పోషించాడు. ఎక్కడా అనవసరంగా హీరోయిజం చూపించలేదు. తన బలాల్ని మెలిగి ప్రవర్తించాడు. సమంత ఎప్పుడూ నవ్వుతూ (అవసరానికి మించి) కనిపించింది. తన పాత్రనీ బాగానే వాడుకున్నారని చెప్పాలి. విశాల్ పక్కన మరీ పొట్టిగా కనిపించింది. అర్జున్ ఈ కథకు ప్రాణం పోశాడు. చాలా స్టైలీష్గాఉన్నాడు. విశాల్ పోషించిన కరుణ పాత్ర కంటే వైట్ డెవిల్ పాత్రే ఎక్కువగా గుర్తుండిపోతుంది. కొన్ని చోట్ల అర్జున్ ముందు విశాల్ తేలిపోయాడు కూడా. మిగిలినవాళ్లలో తమిళ మొహాలే ఎక్కువ.
సాంకేతిక వర్గం
దర్శకుడు సామాన్య ప్రేక్షకుడు త్వరగా కనెక్ట్ అయ్యే కథని ఎంచుకున్నాడు. సాంకేతిక పరిజ్ఞానం గురించి అందులో జరుగుతున్న మోసాల గురించీ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. తనకు మిగిలిన సాంకేతిక విభాగం నుంచి సరైన సహకారం అందింది. కెమెరా వర్క్, ఎడిటింగ్‌లో నేర్పు బాగా పనికొచ్చాడు. దర్శకుడు తన తెలివితేటల్ని వాడిన చోట.. మెప్పించాడు. డైలాగులు బాగున్నాయి. ఏటీఎమ్కీ, ఓటు మీటకీ తేడా చెప్పిన డైలాగ్ క్లాప్స్ కొట్టిస్తుంది.
తీర్పు
ఈ తరం మనిషి చేతిలో వున్న మినీ మారణాయుధం లాంటిది మొబైల్. రెండు అంచుల కత్తిలాంటి దీని గురించి కాస్త గట్టిగానే చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఇంకా చెప్పాలంటే మరి కాస్త సిన్సియర్ గా చేసాడు. అందుకే ఓసారి చూస్తే, మనకీ మరి కాస్త అవగాహన వస్తుంది. ఏ స్టోర్ లో నైనా అడగగానే మొబైల్ నెంబర్ ఇచ్చేయడం, చీమ చిటుక్కుమంటే ఫేస్ బుక్ లో పెట్టేయడం తగ్గుతుంది.
ఫినిషింగ్ టచ్ : సైబర్ వ్యూహాన్ని ఛేదించి ఈ అభిమన్యుడు గెలిచాడు
Rating — 2.75