అమెరికాలో గుడివాడకు చెందిన అభిషేక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం డాలర్ డ్రీమ్స్ నుంచి బయటకు రాలేకపోతున్న వారికి ఓ పెద్ద మేలుకొలుపు. లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు పోతే చాలు అక్కడ ఏదో ఒకటి చేసి డాలర్స్ సంపాదించవచ్చని అనుకుంటారు. కానీ ఇప్పుడు అది భూతల స్వర్గం కాదు.. నరకంగా మారింది. దానికి సాక్ష్యేమే అభిషేక్ ఆత్మహత్య.
నలిగిపోతున్న విద్యార్థులు
భారత్ నుంచి అమెరికాకు చదుకునేందుకు ఎక్కువ మంది వెళ్తారు. తెలుగువాళ్లు అత్యధికం ఉంటారు. పిల్లల భవిష్యత్ కోసం సర్వం త్యాగం చేసి..తాము సంపాదించినది మొత్తం పెట్టుబడిగా పెట్టి వారిని అమెరికా పంపుతారు. వారు కూడా కష్టపడి తమ తల్లిదండ్రుల ఆశల్ని ..తమ ఆశయాల్ని నెరవేర్చుకోవాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏ మాత్రం సహకరించడం లేదు. చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. అంతకు మించి చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఇండియా రాలేక.. అక్కడే ఉండలేక సతమతమవుతున్నారు.
ఇండియాకు వస్తే పరువు తక్కువని నామోషీ
అమెరికా వెళ్లాడు.. అక్కడ ఉద్యోగం సంపాదించుకోలేక తిరిగి వచ్చేశాడన్న పేరును భరించలేక చాలా మంది అమెరికాలోనే ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారు. అమెరికాలోనే ఉద్యోగం రాలేదంటే ఇక ఇండియాలో ఏమి వస్తుందని.. వచ్చినా ఇప్పటి వరకూ చదువు కోసం పెట్టిన పెట్టుబడికి.. వచ్చే జీతానికి పొంతన ఉండదని అనుకుంటారు. ఇలాంటి మానసిక పరిస్థితుల్లో ఇప్పుడు లక్షల మంది యువత ఉన్నారు. వారందరికి ఎలాంటి దారి కనిపించడం లేదు. ట్రంప్ విధానాల కారణంగా ముందు ముందు ఏదైనా ఆశాదీపం కనిపిస్తుందా అంటే.. అదీ ఉండదని స్పష్టమవుతోంది.
అమెరికా మోజు తగ్గించుకోవడమే మార్గం
ఒకప్పుడు అమెరికా అవకాశాల స్వర్గం. కానీ ఇప్పుడు కాదు. అమెరికాలో ఉన్న లైఫ్ స్టైల్, ఆదాయం.. చాలా చోట్ల లభిస్తున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. అంతే కాదు ఇండియాలోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఎండమావుల వెంట పరుగులు పెట్టకుండా ఇండియాలోనే భవిష్యత్ ను బిల్డ్ చేసుకోవాలి. అమెరికా ఆశలతో జీవితాన్ని చితికిపోయేలా చేసుకోకూడదు.