విజయ్ దేవరకొండ ఏదైనా మంచి చేయాలనే దిగుతాడు. కానీ ఆ మంచి కూడా ఏవో కారణాలతో వివాదం అవుతుంటుంది. కరోనా సమయంలో స్వయంగా ఒక వెబ్ సైట్ పెట్టి అవసరమైన వారికి సహాయం చేసే ఓ కార్యక్రమం చేస్తే దానిపై కూడా పలు కోణాల్లో విమర్శలు వచ్చాయి. తాజాగా తన కొత్త చిత్రం ‘ఖుషి’ సినిమా సంపాదనలోంచి రూ. కోటిని అభిమానులకు ఇస్తానని విజయ్ ప్రకటించడం కూడా ఇప్పుడు వివాదమైయింది.
విజయ్‌ది గొప్ప మనసు అంటూ కొందరు ప్రశంస్తుంటే.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా యూనిట్ మాత్రం భిన్నంగా స్పందించింది. ఆ సినిమాను పంపిణీ చేసి రూ. 8 కోట్లు నష్టపోయామని, అందుకు తమకూ సాయం అందించాలంటూ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయిన ఆ సినిమాతో ఇప్పుడు విజయ్ చారిటీకి ముడిపెట్టడం చర్చనీయాంశమే.
విజయ్ సినిమాతో సంబంధం లేకుండా అవసరమైన వారికి సహాయం చేస్తానని చెప్పాడు. నిజంగా దీనిని స్వాగతించాలి. అభిషేక్ పిక్చర్స్ మాకు సాయం చేయాలని అడగడంలో కూడా తప్పులేదు. ఐతే అడిగే పద్దతి ఇది కాదు. అందరూ ఇండస్ట్రీలోనే వున్నారు. పర్శనల్ గా కలసి ‘ఇలా నష్టపోయాం. అందులో కొందరిని ఆదుకోండి’ అంటే హుందా వుండేది. కానీ సినిమా వల్ల నష్టం జరిగింది. ఆ నష్టం పూడ్చండనే రీతితో అడగడం సరికాదనే చెప్పాలి. ఇప్పటికే లైగర్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ వ్యవహారం విజయ్ ని మరింత కార్నర్ చేసినట్లయింది. అయినా సినిమా నష్టపొతే కేవలం హీరోని కార్నర్ చేసే పద్దతి కూడా మంచిది కాదనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది.