టాలీవుడ్లో ఒక్కసారిగా దూసుకొచ్చిన సంస్థ.. అభిషేక్ పిక్చర్స్. నైజాంలో దిల్‌రాజు పేరు బలంగా వినిపించే దశలో…. ఆ పేరుని కూడా డామినేట్ చేసే స్థాయిలో అభిషేక్ పిక్చర్స్ బిజినెస్ చేసింది. దిల్‌రాజుకి పోటీగా వెళ్లి సినిమాలు కొని ఆశ్చర్యపరిచింది. పిదప నిర్మాణ రంగంలోకి దిగి.. భారీ సినిమాల్ని ప్లాన్ చేసింది. అయితే.. ఇప్పుడు ఈ సంస్థ సడన్‌గా చేతులెత్తేసింది. బోయపాటి శ్రీను – బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేయలేం అంటూ… ఈ ప్రాజెక్టు నుంచి జారుకొంది. అందుకు సంబంధించిన కారణాల్ని అన్వేషిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
ఆంధ్ర, తెలంగాణకు చెందిన కొందమంది రాజకీయనాయకులు, మంత్రులు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఫండ్ భారీగా ఉండడంతో అభిషేక్ పిక్చర్స్ సంస్థ తొలి రోజుల్లో విరివిగా సినిమాలు కొంది. దిల్‌రాజుకి పోటీగా వెళ్లి సినిమాల్ని భారీ రేట్లకు కొనుగోలు చేసింది. నైజాంలో రూ.15 కోట్లకు మించని సినిమాని రూ.20 కోట్లు పోసి కొనేది. దాంతో… అభిషేక్ పిక్చర్స్ తన ప్రయాణాన్ని స్ట్రాంగ్‌గానే ప్రారంభించింది. అయితే అలా కొన్న సినిమాలన్నీ పల్టీలు కొట్టడం, భారీ నష్టాల్ని తీసుకురావడంతో అభిషేక్… షేకవ్వడం మొదలైంది. బ్రహ్మోత్సవం అభిషేక్ పిక్చర్స్‌ని బాగా దెబ్బకొట్టింది. అంతకు ముందు కొన్న సినిమాలూ ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో అభిషేక్ పెట్టుబడి పెట్టడం తప్ప… లాభాల్ని ఆర్జించిన దాఖలా లేకుండా పోయింది. రూపాయి పోతే.. పావలా అయినా తిరిగొస్తుంది కదా? ఆ పావలా కూడా ఫండింగ్ ఇచ్చిన వాళ్లకు వెళ్లలేదు. దాంతో.. ఫండ్స్ రావడం ఆగిపోయాయి. ఇప్పటి వరకూ ఆర్థిక సహాయం చేసుకొంటూ వచ్చిన వాళ్లు తప్పుకొన్నారు. ఈమధ్య అభిషేక్ పిక్చర్స్ ఒకేసారి 5 సినిమాల నిర్మాణం చేపట్టింది. వాటి పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉందట. రెండు సినిమాలు తప్ప.. మిగిలినవి ముందుకు కదలడం లేదని తెలుస్తోంది. ఫండింగ్ లేకపోవడం వల్లే.. బోయపాటి శ్రీను సినిమా నుంచి డ్రాప్ అయ్యిందీ సంస్థ. అదీ… అభిషేక్ పిక్చర్స్ బీహైండ్ ద స్టోరీ.