మొన్నీ మధ్య జగన్ రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ యాంకర్ వెంకటకృష్ణ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ” ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని మార్పు పై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని” డిమాండ్ చేస్తూ గంటల తరబడి డిబేట్ లు పెట్టడం, ఆ డిబేట్లు వైరల్ కావడం, ఐదేళ్ళలో అమరావతిని కట్ట లేక పోయిన చంద్రబాబుని నిలదీయకుండా, ఎన్నికల ముందు మాట మాత్రం చెప్పకుండా ఇప్పుడు రాజధాని మార్చిన జగన్ ని నిలదీయకుండా పవన్ కళ్యాణ్ ని నిలదీయడం ఏంటని నెటిజన్లు వెంకట కృష్ణ మీద ఫైర్ కావడం తెలిసిందే. ఆ డిబేట్ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన విపరీతమైన ట్రోలింగ్ సెగ తనదాకా తగిలిందో ఏమోకానీ, ఈరోజు డిబేట్ లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం పై సంజాయిషీ లాంటి వివరణ ఇచ్చుకున్నారు యాంకర్ వెంకటకృష్ణ. వివరాల్లోకి వెళితే..
Click here:
అమరావతి పై ఏపీ ప్రజలకు పవన్ సమాధానం చెప్పాలంటున్న ఏబీఎన్, నెటిజన్స్ ఫైర్
తదుపరి కార్యాచరణ వివరాలు వెల్లడించిన జనసేన నేత
అమరావతి నుండి రాజధానిని మారుస్తూ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయంపై కర్నూలు, వైజాగ్ తదితర ప్రాంతాల ప్రజలు పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటే, అమరావతి, కృష్ణా, గుంటూరు తదితర ప్రాంతాల ప్రజల నుండి నెగిటివ్ స్పందన వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటేష్ చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరిగింది, పైగా వెంకట వెంకట కృష్ణ ను, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ను నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. ఈరోజు ఇదే టాపిక్ మీద వెంకట కృష్ణ డిబేట్ నిర్వహించగా అందులో పాల్గొన్న జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన తరపున కార్యాచరణ సిద్ధమవుతోందని, లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చలు సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని, హైకోర్టు ఏర్పాటు చేయాలంటే అది సుప్రీంకోర్టు, కేంద్రం పరిధిలో ఉండే అంశమని, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తమ పాలన పూర్తయ్యేలోగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయలేకపోవచ్చు అని చెప్పుకొచ్చారు జనసేన నేత. అదే జరిగితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది అని అంటూ, కర్నూలు హైకోర్టు విషయంలో మాత్రమే కాకుండా మిగతా అనేక అంశాలపై కూడా ఇటువంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, వీటన్నింటిపై ప్రస్తుతం కీలకమైన చర్చ జరుగుతోందని, వాటికి అనుగుణంగానే జనసేన కార్యాచరణ సిద్ధం అవుతోంది అని వ్యాఖ్యానించారు జనసేన నేత.
పవన్ ని టార్గెట్ చేయడంపై సంజాయిషీ లాంటి వివరణ ఇచ్చుకున్న ఆంధ్రజ్యోతి యాంకర్:
దీనికి యాంకర్ వెంకటకృష్ణ సమాధానమిస్తూ, పవన్ కళ్యాణ్ ఏ అంశాన్ని టేకప్ చేసినా, ఇలా పూర్తిస్థాయి లో స్టడీ చేసి కార్యాచరణ నిర్ణయం తీసుకుంటాడని తనకు తెలుసని, అందుకే ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ మాట్లాడితే బాగుంటుందని తాను అభిప్రాయపడ్డానని చెప్పుకొచ్చారు. పైగా ఇటీవల కాలంలో జనసేన అభిమానులు తనను విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, 10 నిమిషాల క్రితం కూడా తనను ట్రోల్ చేస్తున్న మెసేజ్ లు తనకు అందాయని వెంకటకృష్ణ చెప్పుకొచ్చారు. నిజానికి తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం అని, గత ప్రభుత్వ హయాంలో ఉండవల్లి ప్రాంత రైతుల తరఫున పవన్ కళ్యాణ్ నిలబడడం వల్లే ఇప్పుడు ఆ ప్రాంత రైతులు హ్యాపీగా ఉన్నారని ఆంధ్రజ్యోతి యాంకర్ వ్యాఖ్యానించారు. ఉండవల్లి రైతుల సమస్య మాత్రమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఐదు ప్రధాన సమస్యలు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడం వల్లే పరిష్కారం అయ్యాయని, ఆ విషయం తనకు స్పష్టంగా తెలుసునని వ్యాఖ్యానించారు వెంకటకృష్ణ. అందుకే అతి కొద్దిమందికి మాత్రమే నేరుగా ఇంటర్వ్యూలు ఇచ్చే పవన్ కళ్యాణ్ అప్పట్లో తనకు నేరుగా ఇంటర్వ్యూ ఇచ్చాడు అని గుర్తు చేశారు వెంకటకృష్ణ. అంతేకాకుండా ఏపీ ప్రజలకు పవన్ సమాధానం చెప్పాలని తాను ” డిమాండ్” చేయలేదని, ఆయన ఈ సమస్యలో జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఈ సమస్యపై మాట్లాడాలని తాను కోరుకున్నానని వెంకటకృష్ణ వివరణ ఇచ్చారు.
మొత్తానికి వెంకట కృష్ణ వివరణ చూసినవారికి సోషల్ మీడియా సెగ తన కి గట్టిగానే తగిలిందేమో అని అనిపించక మానదు. రాజధాని పై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అంటూ తాటికాయంత అక్షరాలతో బ్యానర్లు పెట్టి, దీనిపై జోక్యం చేసుకోకపోతే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేసినట్లే అని వ్యాఖ్యానించిన వెంకటకృష్ణ ఇప్పుడు తనపై విపరీతంగా ట్రోలింగ్ వస్తున్న విషయం తానే డిబేట్లో అంగీకరించడం, పవన్ కళ్యాణ్ ని తాను “డిమాండ్” చేయలేదు అంటూ సంజాయిషీ తరహాలో వివరణ ఇచ్చుకోవడం గమనార్హం. మరి ఈ వ్యాఖ్యల తర్వాతనైనా వెంకట కృష్ణ మీద ట్రోలింగ్ ఆగిపోతుందేమో చూడాలి.
– జురాన్ (@CriticZuran)