టీడీపీ అంటే.. ఆంధ్రజ్యోతి, జ్యోతి అంటే టీడీపీ. తెలుగుదేశం మానస పుత్రిక.. ఈ పత్రిక. టీడీపీనీ, అందులోని నాయకుల్ని హైలెట్ చేయడానికి జ్యోతి తహతహలాడుతుంది. అలాంటిది… చాలా కాలంగా ఆంధ్రజ్యోతిలో బాలయ్య సినిమాలకు సంబంధించిన కవరేజీ రావడం లేదు. సినిమా పేజీలో బాలయ్య ప్రస్తావన ఉండడం లేదు. దీనికి కారణం.. బాలయ్యని జ్యోతి బ్యాన్ చేయడమే. ఓ సినిమా కవరేజీ విషయంలో జ్యోతిపై బాలయ్య విరుచుకుపడ్డారని, వేమూరి రాధాకృష్ణని ఫోన్లోనే తిట్టిపోశారని, అందుకు ప్రతిగా… ఇక నుంచి బాలయ్య సినిమాల్ని అస్సలు కవర్ చేయకూడదన్న నిర్ణయం తీసుకొన్నారని, అప్పటి నుంచీ బాలయ్య ఫొటోగానీ, పేరు కానీ సినిమా పేజీలో కనిపించడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఓ కవరేజీకి ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ప్రతినిధులు వెళ్తే.. ‘మిమ్మల్ని ఎవడు పిలిచాడు’ అంటూ బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడట. దాంతో.. ఈ గొడవ ఇంకాస్త పెద్దదైంది. అయితే.. బాలయ్య సినిమాలకు సంబంధించిన యాడ్లు మాత్రం జ్యోతిలో వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అది ఆదాయ మార్గం కదా? దాన్ని వదులు కోవడానికి యాజమాన్యం ఇష్టపడడం లేదు. జ్యోతిలో బాలయ్యని బ్యాన్ చేసినా… ఏబీన్ న్యూస్ ఛానల్లోనూ, వెబ్ సైట్ లోనూ బాలయ్య వార్తలు కవర్ అవుతూనే ఉన్నాయి. మరి ఇదేం లెక్కో అర్థం కాదు. ఏబీఎన్. ఆంధ్యజ్యోతి వేరు వేరని.. యాజమాన్యం భావిస్తోందా? ఏమో.. వాళ్లకే తెలియాలి.