ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ ఐదు వారాల కిందట రాసిన… “కొత్త పలుకు”లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే… ఎవరు ఎంత ప్రయత్నించినా… తెలంగాణ రాష్ట్ర సమితికి 80 అసెంబ్లీ స్థానాలు వచ్చి తీరుతాయని కుండ బద్దలు కొట్టారు. కానీ ఆ ఆ తర్వాత నాలుగంటే నాలుగు వారాల్లో… ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని తేల్చేశారు. రాజకీయాల్లో హత్యలుండని.. ఆత్మహత్యలుంటాయని… కేసీఆర్.. పరిస్థితి అదేనని తేల్చేశారు. మహాకూటమి అభ్యర్థుల్ని ప్రకటించకుండానే… ప్రచారం ప్రారంభించకుండానే… టీఆర్ఎస్తో పోటాపోటీగా ఉందని తేల్చేశారు. గులాబీ దళం పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న అరవై ఐదు శాతం సానుకూలత కరిగిపోయిదంని కూడా తీర్పు నిచ్చారు.
నేరుగా కేసీఆర్ ఓడిపోతున్నారని చెబితే.. ఆయనకు కోపం వస్తుందని అనుకున్నారేమో కానీ.. మాటల్లో పోటాపోటీగా ఉందని చెప్పారు.. కానీ.. అనేక వ్యాఖ్యలతో.. కేసీఆర్ ఓడిపోతున్నారని తేల్చారు. కేసీఆర్‌లో అహంకారం పెరిగిపోయిందని.. అలాంటి అహంకారాన్ని తెలంగాణ ప్రజలు ఏమాత్రం అంగీకరించబోరన్నరు. ఈ సందర్భంలో.. కేబినెట్ మొత్తాన్ని డిస్మిస్ చేసిన… ఎన్టీఆర్‌ను కల్వకుర్తిలో ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం కూడా ఓడిపోయిందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే జరగోబోతోందన్నట్లుగా కొత్తపలుకుల్లో ఆర్కే తేల్చేశారు. గతంలో కొత్త పలుకులో తను రాసిన దాన్ని గుర్తు తెచ్చుకుని.. ఇంత కాలంలోనే.. ఇంత మార్పా.. అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. అయితే.. మొత్తం కేసీఆర్ అధికారాన్ని పోగొట్టుకోవడానికి కారణం స్వయంకృతమేనని తేల్చారు. చంద్రబాబు పొత్తు కోసం ముందుకు వచ్చి .. పార్టీని నమ్ముకున్న.. ఆరేడుగురు నేతలకు టిక్కెట్లు మాత్రమే అడిగారని.. కేసీఆర్ అవి కూడా ఇవ్వలేదని.. చంద్రబాబు అందు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని… కేసీఆర్ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చినట్లు తేల్చారు.
జాతీయ స్థాయిలో చంద్రబాబు చేస్తున్న కూటమి ప్రయత్నాలు.. సీరియస్‌గా మారడానికి కూడా.. కేసీఆర్ చేసిన ఆ తప్పే కారణమని ఆర్కే చెబుతున్నారు. టీఆర్ఎస్ పొత్తుకు అంగీకరించి ఉన్నట్లయితే… దేశంలో బీజేపీయేతర కూటమి కోసం.. చంద్రబాబు సీరియస్‌గా ప్రయత్నించేవారు కాదట. కానీ ఇప్పుడు అనివార్యంగా… కీలక పాత్ర పోషించాల్సి వస్తోందని చెబుతున్నారు. చంద్రబాబును తిట్టడం కూడా.. మైనస్‌గా మారిందని తేల్చారు. అంతిమంగా.. చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్ గెలుపోటముల్ని శాసించే స్థితిలో ఉన్నారని విశ్లేషించారు. మొత్తానికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ… కేసీఆర్ విషయంలో తను చెప్పిన జోస్యాన్ని నాలుగైదు వారాల తర్వాత నిస్సంకోచంగా ఖండించుకున్నారు. కేసీఆర్ ఓడిపోబోతున్నారని తేల్చారు.