“పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప..” అనే స్ఫూర్తిదాయక ఉద్వేగాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. మరో విధంగా ఉపయోగించుకుంటున్నారు. “పోరాడితే వచ్చేదేముంది.. పారిపోతే బెటర్” అంటున్నారు. ఈ సలహాను తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు. ప్రతి వారాంతంలో రాసే కొత్తపలుకు ఆర్టికల్లో.. ఈ వారం స్థానిక సంస్థల ఎన్నికలపై.. ఆర్కే గురి పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఉపయోగం లేదని.. కానీ చాలా నష్టాలు ఉన్నాయని.. టీడీపీకి ఏకరవు పెట్టారు. జగన్ తీసుకు వచ్చిన చట్టం వల్ల… ఎన్నికల కమిషన్ ఆదేశాలు కూడా ప్రభుత్వానికి దఖలు పడ్డాయని… టీడీపీ వాళ్లు ఎవరు గెలిచినా.. వారిని బెదిరించి పార్టీలోకి తీసుకోవడమో.. వారిపై అనర్హతా వేటు వేయడమో చేస్తారని.. అలాంటప్పుడు అసలు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఏముందని.. ఆయన కొత్తపలుపు పలికారు.
పోలీసులు వ్యవహరిస్తున్నరు.. తొమ్మిది నెలలుగా ఏపీలో జరుగుతున్న పరిణామలు అన్నింటినీ ఓపిగ్గా వివరించిన ఆర్కే… తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదనే సలహా ఇచ్చారు. సాధారణంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయి. అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ తో పాటు ప్రభుత్వ పథకాలు అందుకునేవారు.. ఓట్లు వేయకపోతే వాటిని ఇవ్వరేమో అనే భయంతో.. ఓట్లు వేస్తారంటారు. అయినా.. పోటీ చేయకుండా పోయే పార్టీ ఏదీ ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్ కూడా.. పోటీ చేసింది. పోటీ చేయకుండా పారిపోలేదు. కానీ.. ఆర్కే మాత్రం.. టీడీపీకి పోటీ వద్దని సలహా ఇస్తున్నారు.
అమరావతిని రాష్ట్ర ప్రజలు ఎలాగూ ఓన్ చేసుకోలేదని… కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా.. స్థానిక సంస్థల్లో టీడీపీ ఓడిపోతే.. మూడు రాజధానులకు.. ఆ జిల్లాల వాళ్లు కూడా మద్దతిచ్చారని చెప్పుకుని జగన్.. మరింత దూకుడుగా.. రాజధాని మార్చుతారని.. ఆర్కే చెప్పుకొచ్చారు. ” ప్రతిపక్షాలు పోటీచేసిన తర్వాత కూడా కృష్ణా- గుంటూరు జిల్లాలలో అధికార పార్టీ గెలిస్తే రాజధాని తరలింపు విషయంలో ముఖ్యమంత్రికి అడ్డు ఉండదు. మూడు రాజధానుల నిర్ణయానికి స్థానిక ప్రజల మద్దతు కూడా ఉందని అధికార పార్టీవాళ్లు ప్రచారం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరించడం మంచిది” అని ఆర్కే సలహా ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు కూడా… సాధారణ ఎన్నికల్లోలా బీజేపీ – జనసేన మధ్య చీలుతాయని … ఆర్కే విశ్లేషించారు
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని… చెబుతున్న ఆర్కే.. తన కొత్త పలుకులో లాజిక్కు అందని విషయం వెల్లడించారు. కింది స్థాయిలో… ప్రభుత్వ పథకాలు అందుకునేవాళ్లలో అసంతృప్తి లేదని.. వారికి ఏపీకి జరుగుతున్న నష్టంపై అవగాహన లేదని తేల్చేశారు. అదే సమయంలో మధ్య తరగతికి అసంతృప్తి ఉందని.. కానీ వారు ఓట్లు వేయడానికి రారన్న అభిప్రాయానికి కూడా వచ్చేశారు. మొత్తానికి ఫైనల్లో.. టీడీపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం దుస్సాహసమే అని తీర్మానించారు.