ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ .. ఈ వారం కొత్తపలుకు ద్వారా కేసీఆర్ జాతీయ రాజకీయ భవిష్యత్‌ను.. రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయ భవిష్యత్‌ను తేల్చేశారు. ఇప్పటికే ఆయన పనైపోయిందని.. దింపుడుకళ్లెం ఆశలతోనే పార్టీ పేరు మార్చుకుని.. రకరకాల విన్యాసాలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి కేసీఆర్‌కు అండగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని… అరవై శాతం మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ముందుగా ఇల్లు చక్కదిద్దుకోవాలని కూడా ఆర్కే సలహా ఇచ్చారు.
కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో కనీస ప్రాధాన్యం లభిస్తుందని ఆర్కే అంచనా వేయలేదు. అసలు కేసీఆర్ కూ ఆ నమ్మకం లేదని.. కేవలం తెలంగాణలో గెలవడానికే విన్యాసాలు చేస్తున్నారని.. ఆర్కే చెబుతున్నారు. తమ వాడు ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని చెప్పి … సెంటిమెంట్ తో మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నది ఆర్కే లాజిక్. అయితే రెండు విడతలుగా అధికారంలో ఉన్నందున ఇక ఎలాంటి లాజిక్ లు పని చేయవని.. పాలనే ముఖ్యమని అంటున్నారు.
అయితే కేసీఆర్ కు ఒకే ఒక్క హోప్ ఉందని ఆర్కే విశ్లేషించారు. అదేమిటంటే.. ఓట్ల చీలిక. ప్రస్తుతం బీజేపీ , కాంగ్రెస్ రెండూ బలంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనే ఆ రెండు పార్టీలు ఉంటే.. కేసీఆర్ నక్క తోకను తొక్కినట్లేనని ఆర్కే అంచనా. బీజేపీ లో ఉన్న అంతర్గత పరిణామాలు.. కొత్తగా చేరే వారికి భవిష్యత్ ఉంటుందనే నమ్మకం లేకపోవడంతో చేరికలు జరగడం లేదు. దీంతో ఆ పార్టీకి నాయకుల కొరత తీరడం లేదు. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ సతమతమవుతోంది. ఈ రెండు పార్టీలు తమ మైనస్‌లు సరి చేసుకుంటే… ప్రజల దృష్టిలో ప్రత్యామ్నాయం కావొచ్చని అది బీఆర్ఎస్కు తెలంగాణలో ఎండ్ పాయింట్ అవుతుందని అంటున్నారు.
ఆర్కే ఇటీవలి కాలంలో చేస్తున్న కొత్త పలుకులు కాస్త అతిశయోక్తిగా ఉంటున్నాయి కానీ ఈ సారి మాత్రం.. ఉన్న పరిస్థితులకు తగ్గట్లుగానే చెప్పారని అనుకోవచ్చు. కేసీఆర్ తో ఉన్న మిత్రుత్వం కారణంగా గతంలో ఎన్నో సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించేవారు. ఈ సారి కూడా ఉత్తర తెలంగాణలో పరిస్థితి చక్కదిద్దుకోమని సలహా ఇచ్చారు.