ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. చలనం లేని ఆంధ్ర సమాజాన్ని మేలుకొల్పే బాధ్యత తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. రాజధాని మార్పు నిర్ణయాన్ని దేశం మొత్తం తుగ్లక్ చర్యగా అభివర్ణిస్తూండగా.. ఏపీ ప్రజలు మాత్రం ఏ భావన వ్యక్తం చేయకుండా… ఉండటాన్ని ఆయన తన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో తప్పు పట్టారు. గత వారమే ఈ దిశగా చైతన్యపరిచేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ వారం మరింత డోసు పెంచారు. ” ఏపీలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. అదొక నాగరిక సమాజమా? అక్కడ అసలు మేధావులు, విజ్ఞులు లేనేలేరా?” అన్న సందేహం కలుగుతోందనేశారు. రాజ్యాంగం ప్రకారం.. రాజధాని ఒకటే ఉంటుందని.. కానీ జగన్ మూడు రాజధానుల పేరుతో.. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారని తేల్చేశారు.
రాష్ట్ర రాజధాని కోసం.. భూములిచ్చిన రైతుల్ని అందరూ కలిసి రోడ్డున పడేశారని.. వారి కోసం వారు పోరాటం చేయడం తప్ప.. రాష్ట్రం మొత్తం స్పందించడం లేదనేది.. ఆర్కే భావన. ఈ వ్యవహారంలో జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చేసిన వ్యాఖ్యాలను… తన ఆర్టికల్లో రెండు సార్లు గుర్తు చేశారు.. వేమూరి రాధాకృష్ణ. అసలు రాజధానిని తరలించడానికి కారణం బయటకు ఏమి చెబుతున్నా.. అక్కడ రాజధాని అభివృద్ది చెందితే.. బాగుపడేది కమ్మ సామాజికవర్గం వారేనని.. వారు ఎప్పటికీ తనకు మద్దతు ఇవ్వరు కాబట్టి… రాజధానిని విశాఖకు మార్చాలనుకుంటున్నట్లుగా జగన్.. తన సహచరులతో చెప్పినట్లుగా ఆర్కే వివరించారు. పైకి మాత్రం ఇన్ సైడర్ ట్రేడింగ్ అని.. లక్ష కోట్ల ఖర్చు అని.. ముంపు అని.. రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారంటున్నారు.
ముఖ్యమంత్రి తీరు వల్ల ప్రాంతీయ విబేధాలు పెరిగిపోతున్నాయని.. ఆర్కే ఆందోళన వ్యక్తం చేశారు. “రాజధాని అయినా ఇవ్వండి లేదా ప్రత్యేక రాష్ట్రమైనా ఇవ్వండి” అని రాయలసీమకు చెందిన ప్రముఖుల నుంచి ఇప్పటికే డిమాండ్ మొదలైందని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే హైకోర్టుతోపాటు రాజధానిపై వివాదాలన్నీ సమసిపోయి ఉండేవి. కర్నూలువాసుల కోరిక మేరకు అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తే సరిపోయేది. అయితే ఇప్పుడు తేనెతుట్టెను కదిలించారు. తేనెటీగల దాడికి ఎవరు బలవుతారో తెలియదని ఆర్కే తేల్చేశారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏపీ .. ఓ రకమైన దారుణ పరిస్థితికి వెళ్లిపోయిందని.. కానీ అక్కడ మేధావులు.. ప్రముఖులు అన్న వారు నోరు మెదపడం లేదని.. అందుకే.. “ఒక జాతి చచ్చిపోయినా ఫర్వాలేదు గానీ జీవచ్ఛవంలా ఉండిపోకూడదు..!” అని సలహా ఇచ్చారు.