సాక్షి, ఏబీఎన్ మధ్య డిజిటల్ మీడియా వార్ ముదురుతోంది. తమ సంస్థ ఎదుర్కొంటున్న అనేక రకాల సాంకేతిక సమస్యలకు సాక్షి హ్యాకింగే కారణం అంటూ ఏబీఎన్ యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఫిర్యాదు కాస్త విచిత్రంగానే ఉంది. తమ పేజ్, చానల్‌కు రావాల్సిన ట్రాఫిక్ అనుచిత పద్దతుల ద్వారా సాక్షి లాగేసుకుంటోందని ఏబీఎన్ వాదన. అందు కోసం ట్యాగ్స్ టెక్నిక్ వాడుతోందని కొద్ది రోజులుగా ఆరోపిస్తోంది. ఇటీవల మళ్లీ తాము బయట పెట్టడంతో ఆ ట్యాగ్ ను తీసేశారని కూడా చెప్పుకుంది.
తాజాగా తమ యాప్ డౌన్ లోడ్‌లో సమస్యలు ఉన్నాయని వ్యూస్ కూడా పెద్దగా రాకపోవడానికి సాక్షి టెక్నికల్ హ్యాకింగే కారణమని ఆరోపిస్తూ కేసు పెట్టారు. అలాగే ఓ సారి తమ లైవ్ లింక్ ను కూడా హ్యాక్ చేసిందని దీనిపై ఏకంగా ఇస్రోకే ఫిర్యాదు చేశామని ఇస్రో విచారణ జరుపుతోందని ఏబీఎన్ తెలిపింది. ఏబీఎన్ ఆరోపణలు టెక్నికల్ గా చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి. ఇలా ఓ చానల్, పేజీ వ్యూయర్స్ ను సాక్షికి మళ్లించుకోవడం సాధ్యమేనా అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
అయితే తాము ఎదుర్కొంటున్న అన్ని టెక్నికల్ సమస్యలకూ సాక్షినే కారణం అని ఏబీఎన్ గట్టిగా నమ్ముతోంది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై సాక్షి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కేసు కూడా నమోదు కావడంతో వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయంతో సంబంధం లేకుండా వందల కోట్లు వెచ్చించగల సాక్షి ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి ఉన్న అవకాశాలను ఎలాగైనా ఉపయోగించుకోగలదు. తమ సాఫ్ట్ వేర్ సెక్యూరిటీని మెరుగుపర్చుకోవడం డబ్బులు దండగ అనుకునే ఏబీఎన్ ను సులువుగానే టార్గెట్ చేయగలదు. ఏం జరిగిందో సైబర్ పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.