“ మీ బాగు కోసమే సార్.. మీరు బాగుండాలనే సార్ “ అని ఏదో సినిమాలో సినిమాలో సునీల్ అంతా చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉంది ఈ వారం ఆంద్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్తపలుకు. ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా చంద్రబాబు,లోకేష్ అభివృద్దిపై దృష్టి పెట్టి అసలు రాజకీయాలు చేయనట్లుగా ఆయన చాలా బాధపడిపోతూ ఆర్టికల్ రాశారు. ఏడు నెలలు అయిపోయింది జగన్ కేసులు ముందుకు కదల్లేదు.. వైసీపీ నేతల అరెస్టులు లేవు.. వారు చేసిన అవినీతిపై చర్యలు లేవు.. అని ఆర్కే చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల నాటి పరిస్థితుల్ని విశ్లేషించారు. బీజేపీతో కలిసి జనసేన పార్టీ విడిగా వెళ్లిపోతుందని జోస్యం చెప్పారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కానీ.. అలా జరిగేందుకు ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేసేది ఇలాంటివే శ్రేయోభిలాషి విశ్లేషణలే.
నారా లోకేష్ కూడా అభివృద్ధి అని తిరుగుతున్నారని పార్టీపై పట్టు సాధించలేకపోతున్నారని ఆర్కే భావన. ఆయన ఉద్దేశం ప్రకారం టీడీపీ అధ్యక్ష పదవిని నారా లోకేష్‌కు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా ఉంది. లోకేష్ ఎన్ని పెట్టుబడులు తెచ్చినా అవి చంద్రబాబు నీడలోనే ఉంటాయని ఆయనకే ఇమేజ్ వస్తుందని అంటున్నారు. నిజానికి లోకేష్ ఇప్పటికే పార్టీపై పూర్తి స్థాయి పట్టుసాధించారని గుసగుసలు ఉన్నాయి. చివరికి కేబినెట్ లో మంత్రులు కూడా లోకేష్ చాయిస్ అని చెప్పుకుంటున్నారు. అంతే కాదు వైసీపీ నేతలపై చర్యలు తీసుకునే విషయాన్ని కూడా లోకేషే ఫాలో అప్ చేస్తున్నారని ఈ విషయంలో చంద్రబాబు జోక్యం కూడా లేదని టీడీపీ క్యాంప్ లో చెబుతారు. మరి ఆర్కేకు ఎక్కడ సమస్య వచ్చిందో ?
రాజకీయాలు చేయాలంటే ప్రత్యర్థుల్ని బలహీనుల్ని చేయాలని ఆర్కే అంటున్నారు. ఆర్కే చంద్రబాబు, కేసీఆర్‌లతో పాటే జర్నలిజం కెరీర్ ప్రారంభించారు. ఆయనకు తెలియని రాజకీయం ఉండదు. ఈ సమయంలో జగన్ రెడ్డిని అలా వదిలేయకుండా.. ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి తొక్కేయాలని చూస్తే .. ఆయన బలపడతాడా.. బలహీనపడతాడా..?. ఆర్కే చెప్పినట్లు 2019 తర్వాత టీడీపీ బలపడింది అంటే కారణం జగన్ రెడ్డే. ఇప్పుడు కూడా వైసీపీ బలపడటానికి జగన్ రెడ్డికి టీడీపీ సాయం చేయాలన్నట్లుగా ఆర్కే తీరు ఉంది.
ఫైనల్‌గా మోదీని చూసి నేర్చుకోవాలని ఆర్కే సలహాలు ఇస్తున్నారు. దేశ రాజకీయాలు చేయడానికి..రాష్ట్ర రాజకీయాలు చేయడానికి చాలా తేడా ఉంటుంది. అక్కడ ఉండే పరిస్థితులకు.. ఇక్కడ ఉండే పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. రాజకీయాల్ని అధికారం అండతో మార్చేయాలనుకోవడం అమాయకత్వం. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను చూస్తే.. అధికారంతో తొక్కేయాలనుకుంటే ఎవరికీ సాధ్యంకాదు. కానీ చంద్రబాబు, లోకేష్‌కు తమ పార్టీని ఎలా విస్తరించుకోవాలో.. స్పష్టమైన అవగాహన లేకుండా ఉంటుందా ?. కానీ ఆర్కే వాళ్లేమీ వాళ్ల పార్టీ గురించి పట్టించుకోడం లేదని..తాను మాత్రమే బాధపడుతున్నట్లుగా ఈ సెంటిమెంటల్ స్టోరీలు ఎందుకు చెబుతున్నట్లు ?