రేవంత్ రెడ్డి ట్యాపింగ్ కేసును ఎంత సీరియస్ గా తీసుకుంటారో తెలియదు కానీ పూర్తిగా దృష్టి పెడితే మాత్రం దేశంలోనే ఈ ట్యాపింగ్ కేసు ఓ కేస్ స్టడీ అవుతుందని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తన వారాంతపు పలుకులో చెప్పారు. రేవంత్ వెనక్కి తగ్గుతారని.. ట్యాపింగ్ కేసు విషయంలో కొంత మందిని కాపాడతారని ఎందుకు అనుకుంటున్నారో కానీ… అలా కాపాడకపోతే మాత్రం కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అభిప్రాయం. ట్యాపింగ్ కేసు అంశంపై సుదీర్ఘంగా చర్చించిన ఆర్కే.. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ప్రకటించారు. తాను ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఏపీ ప్రభుత్వం సమాచారం సేకరిస్తోందని తెలిపారు. అయితే తాను భయపడబోనని… ఎవరు వింటున్నా.. తన మాటలు.. ఒకేలా ఉంటాయని ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు.
ఆర్కే ఉద్దేశం సింపుల్ గానే అర్థం చేసుకోవచ్చు. ట్యాపింగ్ కేసు నుంచి కేసీఆర్, కేటీఆర్ బయట పడితే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేసు విషయంలో నక్కచ్చిగా ఉండకపోవడమేనన్న సందేశాన్ని నేరుగానే ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయంలో అధికారులు జైలుకెళ్లారు. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెడుతున్నారు. అదే జరిగితే.. అనధికారిక ట్యాపింగ్ చేసిన వారంతా జైలుకెళ్తారు. ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ట్యాపింగ్ పై ఆంధ్రజ్యోతి అనేక కథనాలు రాసింది. అయితే ఇప్పుడు జనరలైజ్ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు కానీ ఎవరూ దొరకడం లేదని అంటున్నారు. దొరికిన మొదటి కేసు కేస్ స్టడీ అవుతుందంటున్నారు.
అయితే ట్యాపింగ్ చేసి నష్టపోయింది కూడా కేసీఆరేనని ఆర్కే అంటున్నారు. కుటుంబసభ్యుల మాటలు కూడా విని మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారని.. హరీష్ రావును దూరం చేసుకున్నారని అంటున్నారు. హరీష్ రావును తప్పని సరిగా దగ్గరగా ఉంచుకుంటున్నప్పటికీ గ్యాప్ మాత్రం ఏర్పడి ఉంటుందని సరైన సమయంలో బయటకు వస్తుందని ఆయన ఉద్దేశం కావొచ్చు.. ఈటల రాజేందర్ ను కూడా ట్యాపింగ్ కారణంగా దూరం చేసుకున్నారని ఆర్కే అంటున్నారు.
మొత్తానికి ట్యాపింగ్ కేసు చిన్నది కాదని.. సంచలనాత్మకమైనదని ఆర్కే ఉద్దేశం. కేసీఆర్ అరెస్టుతోనే .. దేశానికి కేస్ స్టడీ కావాలని.. వదిలేస్తే అది రేవంత్ తప్పేనని… తన కొత్త పలుకు ద్వారా సందేశం ఇచ్చారు. మరి రేవంత్ ఏం చేస్తారో !