ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కూడా కేసీఆర్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆయన రాజకీయాలు చేస్తున్న తీరు ప్రజల్ని అవమానించేలా ఉందని విశ్లేషించారు. దానికి కారణం స్టీల్ ఫ్యాక్టరీ కోసం బిడ్ దాఖలు చేయాలని నిర్ణయించడమే. ఆయన నిర్ణయం వల్ల ఉత్తరాంధ్రలో ఇరవై సీట్లు వస్తాయని కేసీఆర్ కాకి లెక్కలు వేసుకుంటున్నారట. ఆంధ్రప్రజలు అంత వెర్రి వాళ్లని కేసీఆర్ గట్టి నమ్మకమని… ఫేక్ ప్రచారాలకే పడిపోతారని ఆర్కే అంటున్నారు. మహారాష్ట్రలో చోటామోటా నాయకుల్ని చేర్చుకుని అక్కడేదో తిరుగులేని శక్తిగా మారిపోయామని కేసీఆర్ ఊహించుకుంటున్నారని… ఆర్కే ఓ రకంగా జాలి చూపించారు.
ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ముందు హోంగ్రౌండ్ తెలంగాణపై దృష్టిపెట్టాలని ఆర్కే సూచించారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే జరగాల్సిన ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే… జాతీయ రాజకీయాలు కాదు కదా తెలంగాణ రాజకీయాల్లోనూ ఉండలేని పరిస్థితులు వస్తాయని ఆర్కే చెబుతున్నారు. తెలంగాణ వనరులను దోచుకుని దేశమంతా రాజకీయం చేయాలనుకుంటున్నకేసీఆర్.. అదే సమయంలో తెలంగాణలో తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకూ పట్టించుకోని పరిశ్రమలను ప్రారంభించకుండా ఇతర రాష్ట్రాల్లోవి కొంటామంటూ వెళ్తే ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు.
స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో అప్పలరాజు .. తెలంగాణప్రజల్ని బుర్ర లేదని తిట్టారు. కానీ ఏపీ ప్రజలకే బుర్ర లేదని కేసీఆర్ నిరూపించారని… మరోసారి ఆయన స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో తన నిరూపించే ప్రయత్నంలో ఉన్నారని ఆర్కే చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి చెవిలో బీజేపీ పూలు పెట్టేసిందని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పడంతో క్రెడిట్ గేమ్ ప్రారంభించిన పార్టీలకు షాక్ ఇచ్చినట్లు అయిందని ఆర్కే తేల్చారు.
ఈ వారం జగన్‌కూ తన పలుకులో కొంత స్పేస్ కేటాయించారు ఆర్కే. కోడికత్తి కేసులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. వివేకా హత్య కేసులో చెబుతున్న కథలను సెటైరిక్‌గా వినిపించారు . సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించినందుకే హత్య అంటూ హైకోర్టులో నిరంజన్ రెడ్డి చెప్పిన కథ ఎర్రమందారం సినిమాలోదని.. ఇంకా ఎన్నెన్ని కథలు వచ్చే ఎన్నికల వరకూ వినాల్సి వస్తుందోనని… ఆర్కే తన పలుకులో సర్కాజం చూపించారు.