ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఈ వారం కొత్తపలుకు పలుకుతూ.. అటు ఏపీ సీఎం చంద్రబాబుకు.. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సలహాలివ్వలేదు. అలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి రాజకీయాల్ని మాత్రం పొగిడేశారు. రాజకీయ లాభనష్టాలపై బేరీజు వేసుకోకుండా సాగుతున్న ఆయన పాలనను కీర్తించారు. రేవంత్ రెడ్డి అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పేశారు. సీఎం కుర్చీకి ఎంత ఫైర్ ఉందో రేవంత్ నిరూపిస్తున్నారని అంటున్నారు.
ఇప్పటి వరకూ గతంలో పలుమార్లు రేవంత్ రెడ్డి దూకుడుగా ఉంటున్నారని .. మాటలు అదుపులో పెట్టుకోవాల్సి ఉందని ఇలా తనదైన రీతిలో చాలా సలహాలు ఇచ్చిన ఆర్కే ఈ సారి మాత్రం రేవంత్ రెడ్డి ఫ్యాన్ గా మారిపోయినట్లుగా ఆయన రాసుకొచ్చారు. కేటీఆర్ ను చాలా ప్లాన్డ్ గా ఇరికించారని ఎంత కాలం జైల్లో ఉంచుతారోనని సందేహం వ్యక్తం చేశారు. జైలుకెళ్లిన వాళ్లంతా సీఎం అవుతారని అనుకుంటున్న బీఆర్ఎస్ నేతల ఆశలపైనా ఆయన నీళ్లు చల్లేశారు. ఆయన మాటల్లో అసలు కేటీఆర్ సీఎం కాలేడన్న అర్థం ధ్వనించింది.
రేవంత్ రెడ్డి అల్లు అర్జున్, సినీ పరిశ్రమ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలనూ ఆర్కే సమర్థించారు. అందులో తొందరపాటు ఉందని అరెస్టులు, తదుపరి చర్యలు అన్నీ కక్ష పూరితంగా చేస్తున్నారని కానీ అనలేదు. కానీ.. అల్లు అర్జున్ .. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందునే ఇలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని పరోక్షంగా తేల్చేశారు. ఇటీవలి కాలంలో పాలనలో ఉన్న వారికి సలహాలివ్వకుండా.. పొగడ్తలు కురిపించిన కొత్త పలుకు ఇదే కావొచ్చు.