వైసీపీలో కానీ.. బీజేపీలో కానీ ఇతర పార్టీల్లో కానీ ఆయా పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ అధినేతలు ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తారు. కానీ టీడీపీలో మాత్రం పార్టీ అధినేత నిర్ణయాన్నే తప్పు పడుతూ పోస్టులు పెడతారు. అధినేతపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తారు అని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో విశ్లేషించారు . సొంత పార్టీ అధినేతకే ఇలా చేయాలి.. అలా చేయాలని అసువుగా సలహాలిస్తారని లేకపోతే తిట్టిపోస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. అదే సమయంలో జగన్‌లా చేయాలని కోరుకుంటున్నారని అది ఎంత ప్రమాదకరమో చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్కే ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలకు నీతులు చెబుతున్నారు కానీ.. వారిని రెచ్చగొట్టే విషయంలో ఆంధ్రజ్యోతిది కీలక పాత్ర.
ప్రభుత్వంలో ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో చెప్పకుండా ఇప్పటికీ వైసీపీ నేతలకే.. వారి అనుచరులకే.. వారు నియమించిన వారికే పనులు అవుతున్నాయని గత ఆరేడు నెలలుగా రాస్తూనే ఉన్నారు. అందులోఅత్యధికం మిస్ ఇన్ఫర్మేషనే. విశాఖ రుషికొండ కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించారని రాసేశారు.. కానీ అదే కాంట్రాక్టర్ చేసిన వేరే పనులకు బిల్లులు చెల్లించారన్నది నిజం. ఇలా టీడీపీ కార్యకర్తలు అపోహలు పడేలా.. ఇప్పటికీ ఆంధ్రజ్యోతిలో కథనాలు వస్తాయి. అంత ఎందుకు గత రెండు, మూడు నెలలుగా కొత్తపలుకులను చూస్తే.. చంద్రబాబు మీద క్యాడర్ కు కోపం పెంచేలా చేసింది కూడా ఆర్కేనే అని సులువుగా అర్థమైపోతుంది.
చంద్రబాబు మళ్లీ హైటెక్ అయిపోతున్నారని.. ఇప్పుడు ఏఐ అంటున్నారని.. కార్యకర్తల అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని లేదని.. ఇలా రకరకాలుగా రాసుకొచ్చారు.ఇందులో ఆయనకు ఉన్న ప్రయోజనం ఏమిటో కానీ.. ఆయన రాతలపైనే ఎక్కువగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభావితమయ్యారు. చూశారా.. మేం చెబుతోంది ఇదే అని ఆర్టికల్స్ ను చూపించి చంద్రబాబును నిందించిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆర్కేకు ఇక్కడ ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఇతర పార్టీలకు చెందిన ఎవరూ తమ అధినేతల్ని ఏమీ అనరు.. ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తారు. కానీ టీడీపీలో భిన్నం. అదే టీడీపీ ప్రత్యేకత. ఎందుకంటే టీడీపీలో పెయిడ్ సోషల్ మీడియా సైన్యం కన్నా.. సొంతంగా అభిమానంతో పని చేసే సైన్యం ఎక్కువ. తమకు ప్రశ్నించే హక్కు ఉందనుకుంటారు. ఇలాంటి వారికి మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆవేశపడేలా చేస్తున్న తప్పు మాత్రం ఆంధ్రజ్యోతిదే.
ఇక రేవంత్ కు మంచి రోజులు వస్తున్నాయని ఆర్కే ఇదే ఆర్టికల్ లో సంబర పడ్డారు. కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సింపుల్ గా ఉంటారని.. పని చేసేవారికే ప్రాధాన్యం ఇస్తారని.. ఈ ప్రకారం ఇప్పుడు రేవంత్ కు పూర్తి స్వేచ్చ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ రేవంత్ కాళ్లూ చేతులూ కట్టి ఈదమంటున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్ పై అసంతృప్తి ఉందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి ఇటీవలి కాలం వరకూ వంత పాడారు ఆర్కే. ఇప్పుడు మళ్లీ ఆంధ్రజ్యోతిని బీఆర్ఎస్ నేతలు ఆంధ్రపత్రిక అనే వాదన ప్రారంభించడంతో మళ్లీ రేవంత్ రెడ్డిలో ఆయనకు సానుకూలతలు కనిపిస్తున్నట్లున్నాయి.