ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ .. వేమూరి రాధాకృష్ణ.. “కొత్త పలుకు”లో రెండు వారాల్లోనే స్పష్టమైన మార్పు వచ్చింది. రెండు వారాల కింద రాసిన “కొత్త పలుకు”లో.. మహాకూటమిలో భాగం కావొద్దని.. చంద్రబాబును బెదిరింపులతో కూడిన బ్లాక్మెయిల్ చేసిన.. వేమూరి రాధాకృష్ణ… తెలంగాణలో కేసీఆర్‌కు ఏ విధంగా చూసినా 80 అసెంబ్లీ సీట్లు ఖాయమని తీర్పిచ్చేశారు. గత వారం కొత్త పలుకు ఆర్టికల్‌కు విరామం ఇచ్చారు. కానీ ఈ వారం “కొత్త పలుకు”లో మాత్రం పూర్తిగా స్వరం మార్చారు. తన బెదింపులతో కూడిన బ్లాక్మెయిళ్లను.. చంద్రబాబు ఏ మాత్రం ఖాతరు చేయకుండా… మహాకూటమిలో టీడీపీ భాగం కావడంతో పాటు… వ్యూహాలు మొత్తం తనే పన్నుతూండటంతో… ఆర్కేకు అసలు విషయం అర్థమైపోయినట్లుంది. అదేమిటంటే.. ఒక వేళ.. మహాకూటమిలో భాగం కాకుండా.. టీఆర్ఎస్కు సేఫ్ పాసేజ్ ఇచ్చేస్తే… కేసీఆర్ మరింత బలపడతారని.. ఏపీ ఎన్నికల్లో మోడీతో కలిసి కచ్చితంగా ఇబ్బంది పెడతారని చంద్రబాబు అంచనా వేసి..కేసీఆర్‌ను ఎంతో కొంత బలహీనం చేసే ఉద్దేశంతో మహాకూటమిలో చేరారట. కేసీఆర్ బలహీనం చేస్తే ఆటోమేటిక్‌గా మోడీ కూడా బలహీనపతారనేది చంద్రబాబు అంచనా అని ఆర్కే మార్క్ విశ్లేషణ. మరి ఈ మాత్రం అంచనా వేయకుండా.. రెండు వారాల కిందట.. మహాకూటమిలో టీడీపీ చేరవద్దని.. అలా చేస్తే.. కేసీఆర్ ఏపీలో చంద్రబాబును ఓడిస్తారని.. బెదిరించడం ఎందుకు..?
రెండు వారాల కిందట.. “కొత్త పలుకు”లో … మహాకూటమి కాదు. .ఏ కూటమి వచ్చినా..కేసీఆర్‌కు 80 అసెంబ్లీ సీట్లు ఖాయమని కుండబద్దలు కొట్టిన ఆర్కే.. ఈ సారి మరీ అంత ధీమా కేసీఆర్‌పై చూపించలేకపోయారు. కేసీఆర్‌పై కాదు కానీ.. ఎమ్మెల్యేలపై అరవై శాతానికిపైగా వ్యతిరేకత ఉందట. అది తీవ్ర ప్రభావం చూపించబోతోందట. మహాకూటమి దీన్నే అస్త్రంగా చేసుకోబోతోందట. ఇవన్నీ రోజూ.. పేపర్ చదివే రాజకీయ ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఉత్తర తెలంగాణలో మాత్రమే కేసీఆర్ కాస్త ధీమాగా ఉంది. మిగతా చోట్లా పరిస్థితి కష్టంగానే ఉందని.. ఆర్కే విశ్లేషించారు. ఇందులో కీలకం ఏమిటంటే.. వరంగల్‌లో టీఆర్ఎస్ బలహీనపడటం. టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనుకున్న ప్రాంతాల్లో అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉందట. అంటే రెండు వారాల కిందట.. 80 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న ఆర్కే.. ఇప్పుడు “ప్చ్”అనే పరిస్థితికి వచ్చారు.
ఆర్కే “కొత్త పలుకు”లో ఈ సారి తెలంగాణలో మీడియా పరిస్థితిని కూడా వివరించారు. కొంగరకలాన్ సభ ఫ్లాప్ అయినా.. ప్రధాన మీడియా రాయలేదని.. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. ఆ సభ అట్టర్ ఫ్లాప్ అని అందరూ తీర్మానించేశారంటున్నారు. అంతే.. కాదు.. ప్రధాన మీడియాను కేసీఆర్ ఎలాగోలా గుప్పిట్లో పెట్టుకోగలిగినా… ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. అది నిజమే కదా.. ప్రజాస్వామ్యానికి పునాదుల్లాంటి మీడియా.. అధికారవర్గాలకు .. అదిలింపులకో.. విదిలింపులకో లొంగిపోతే.. సామాన్యుడికి సోషల్ మీడియానే నిజాలను అందిస్తోంది. ఆర్కే “కొత్త పలుకు” లో రెండు వారాల్లో వచ్చిన మార్పుతోనే… అసలు మీడియా పరిస్థితి ఎలా ఉందో.. నెటిజన్లు సులువుగా అంచనా వేసుకోగలరు.