ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కాం వ్యవహారంపై బంగారం లాంటి కొంత ఇన్ సైడ్ న్యూస్ ను తన కొత్త పలుకులో బయట పెట్టారు. అదేమిటంటే ఓ మద్యం కంపెనీ 350కేజీల బంగారం కొన్నదట. ఆ కొన్న బంగారం అహ్మద్ అనే వ్యక్తి తీసుకున్నారని చెప్పారు. ఈ మరి ఆ అహ్మద్ ఎవరికి ఇచ్చారు ? అనేది తర్వాత దర్యాప్తులో తేలుతుందని అంటున్నారు. నిజానికి ఆర్కే రాసిన దాని ప్రకారం చూస్తే మద్యం స్కాంలో కింది నుంచి పైదాకా ఏం జరిగిందో.. డబ్బులు ఎలా .. ఎలా సర్క్యులేట్ అయ్యాయో కూడా సీఐడీ బయటకు లాగేసినట్లుగా ఆర్కేకు సమాచారం ఉందని అర్థం చేసుకోవచ్చు.
ఇంత పెద్ద మొత్తం స్కాంలో ఎవరి వాటాలు వారికి పంపి అసలు మేజర్ షేర్ కొట్టేసేది ఎవరో కూడా ఆర్కేకి తెలుసు. ఆ మాటకొస్తే అందరికీ తెలుసు. కానీ సాక్ష్యాలు కావాలి. అవి సీఐడీ దగ్గర ఉన్నాయని ఆర్కే మాటల్ని బట్టి అర్థమవుతుంది. బంగారం కొనుగోలు లాంటి వ్యవహారాలన్ని కూడా బయటకు తీశారంటే.. ఇంకా చాలా లోతు ఉంటుందని చెప్పాల్సిన పని లేదు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే ఇద్దర్ని సీఐడీ దగ్గర పెట్టుకుని ఒక్కటొక్కటి బయటకు లాగిందని అర్ధమవుతుంది.
అయితే ఈ కేసులో విజయసాయిరెడ్డి నిందితుడు. కానీ ఆయన నిజం చెబుతాడన్న నమ్మకాన్ని ఆర్కే వ్యక్తం చేయలేదు. కాకినాడ పోర్టు వ్యవహారంలో జగన్ ను తప్పించేందుకు విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని ఆర్కే చెబుతున్నారు. అలాగే మద్యం స్కాంలో కూడా నిందితుడు రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు కానీ జగన్ కు తెలుసని చెప్పడంలేదు. ఇక్కడే ఆయన నిజాయితీ బయటపడుతోందని ఆర్కే అంటున్నారు. సీఐడీ విచారణకు పిలిస్తే మద్యం స్కాంలో తనకు తెలిసినవన్నీ బయట పెడతానని చెప్పారు కానీ..బయట పెట్టకపోవచ్చని ఆర్కే అంటున్నారు.
ఆర్కే ఈ వారం కొత్తపలుకులో ఇతర విషయాలు .. తెలంగాణ బూతుల రాజకీయాల గురించి రాసినప్పటికీ మద్యం స్కాం విషయంలో ఏపీలో ఆరోపణలు మాత్రమే కాదని ఆధారాలతో సహా సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పకనే చెబుతున్నారు. మీకు ముందే ఎలా తెలుసు అంటారని చాలా విషయాలను ఆయన చెప్పలేకపోయారని .. నిగ్రహించుకున్నారని అర్థమవుతోంది.