ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మళ్లీ తనలోని జర్నలిస్టును బయటకు తీస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకు ద్వారా మాత్రమే బయట ఉనికి చాటేవారు. అదేఆర్టికల్ను శనివారం సాయంత్రం టీవీలోనూ వీకెండ్ కామెంట్ బై ఆర్కే పేరుతో ప్రసారం చేసేవారు. ఆయనకు తీరిక లేనప్పుడు అది కూడా ఉండదు. అయితే ఇప్పుడు ఆయన నేరుగా స్క్రీన్ పైకి రావాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అలాగే బిగ్ డిబేట్లు… ఓపెన్ డిబేట్లు నిర్వహించేవారు. ఇటీవలి కాలంలో అన్నీ మానేశారు. కానీ ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకుని రెడీ అయిపోతున్నారు.
వచ్చే వారం నుంచి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పునం ప్రసారం కాబోతోంది. తొలి ఇంటర్యూ షర్మిలదే కావొచ్చని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందు కోసం ఏబీఎన్ కార్యాలయంలో కొత్త స్టూడియో కూడా రెడీ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల ప్రారంభం కాలేదు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో ఆయన స్క్రీన్ మీదకు రావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సారి ఓపెన్ హార్ట్ ప్రోగ్రాంతో మాత్రమే కాకుండా ప్రైమ్ టైమ్ డిబేట్లు కూడా నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం వారానికి ఓ రోజు బిగ్ డిబేట్.. ఆదివారం ఓపెన్ హార్ట్ ప్రైమ్ టైమ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతానికి ఏబీఎన్‌లో ప్రైమ్ టైమ్ డిబేట్లు చేయడానికి వెంకటకృష్ణ ఉన్నారు. ఆయన స్థానంలో ఓ రోజు బిగ్ డిబేట్ పేరుతో రాధాకృష్ణనే చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏబీఎన్‌లో తొలి నాళ్లలో మంచి పేరు తీసుకు వచ్చిన ప్రోగ్రాం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఆర్కే ఆడిగే ప్రశ్నలు మాస్ పల్స్ ను పట్టుకునేలా ఉండటంతో హాట్ టాపిక్ అయింది. ఎన్ని విమర్శలు వచ్చినా కావాల్సింది అదే కాబట్టి… వచ్చిన అతిధిని బట్టి ఆ స్థాయి ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు తన ఇంటర్యూ స్టైల్‌ని మారుస్తారో లేదో వేచి చూడాలి. రాధాకృష్ణ తెరపైకి రావడం ఆ చానల్‌కు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.