ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు” లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ఈ సారి రాజకీయ అంశాల కన్నా.. పాలనా పరమైన అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టి.. ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మె విషయం తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు లేకుండాపోయిన వైనం.. హైకోర్టు కూడా.. కార్మికులకు ఆశలు రేపి.., ఊసూరుమనిపించిన వైనాన్ని నిశితంగానే విశ్లేషించారు. గత ఆర్టికల్లో హైకోర్టు ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని.. ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు.. ఆ ప్రతిపక్ష పాత్ర నుంచి హైకోర్టు తప్పుకోవడమే… దీనికి కారణం కావొచ్చు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి ఇలా మారడం బాధాకరమని.. రాధాకృష్ణ చెబుతున్నారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా అందరూ కలిసి ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకున్నారని తేల్చారు.
రాజకీయంగా టక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించడంలో ఆరితేరిన కేసీఆర్ ముందు నిలబడే నాయకుడే లేకుండా పోవడం వల్ల తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఆర్కే విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితులలో కేసీఆర్ను శరణు కోరడం మినహా కార్మికులకు మరో ప్రత్యామ్నాయం లేదని సలహా ఇచ్చారు. “నా తెలంగాణకు బయటివాడు ద్రోహంచేస్తే సరిహద్దుల అవతలకు తరిమికొడతాం. లోపలివాడే ద్రోహానికి పాల్పడితే పాతరేస్తాం” అన్న కాళోజీ నినాదం తెలంగాణ ఉద్యమ సమయంలోనే అక్కరకు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కాళోజీకే స్థానం ఉందా? అని ప్రశ్నించి.. తెలంగాణ వాదుల్లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నాన్ని ఆర్కే చేశారు. కానీ.. అలాంటి పరిస్థితి లేదని.. ఆయనే చెప్పకనే చెప్పారు.
ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనా తీరును.. జగన్ కంటే కేసీఆర్ బెటర్ అని తేల్చారు. మొండితనం వేరు- మూర్ఖత్వం వేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఐదున్నరేళ్లుగా గమనించినవారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరు నెలల పాలన గమనించి పోల్చుకున్నప్పుడు.. కేసీఆర్ కొంచెం మెరుగు అని భావిస్తున్నారని రాసుకొచ్చారు. పెట్టుబడుల కోసం వివిధ రాష్ట్రాలు పోటీపడుతున్న తరుణంలో “మా ఫిలాసఫీ నచ్చకపోతే పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోయినా ఫర్వాలేదు” అని మంత్రి ఆదిమూలపు సురేశ్ చేసిన ప్రకటనను ప్రత్యేకంగా ఆర్కే ప్రస్తావించారు. కేంద్రం.. రాష్ట్రప్రభుత్వంపై గుర్రుగా ఉందన్నారు. అమరావతి విషయంలో.. ఏపీ సర్కార్ తీరు ఎలా రివర్స్ అవుతుందో చెప్పారు. రంగులు పూస్తున్న వైనాన్నీ తప్పు పట్టారు.