ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం “కొత్తపలుకు” వైసీపీ – బీజేపీ నేతల మధ్య ప్రారంభమైన కొత్త వివాదంపై సరికొత్త విశ్లేషణ చేశారు. జగన్మోహన్ రెడ్డికి తన కేసుల విషయంలో బీజేపీ సహకరిస్తుందన్న నమ్మకం పోయిందని…బెయిల్ రద్దవుతుందన్న భయంతోనే కేంద్రంపై ఎదురుదాడి ప్రారంభించారని ఆయన తన వారాంతపు ఆర్టికల్‌లో విశ్లేషించారు. ఎలాగూ జైలుకెళ్లాల్సి వస్తుందని.. కానీ జైలుకు వెళ్లేలోపు తన సంక్షేమ ఇమేజ్‌కు ఏ మాత్రం మచ్చ పడకుండా చూసుకోవాలనుకుంటున్నారని .. అందుకే డబ్బులు పంచడానికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపణలు ప్రారంభించారని అంటున్నారు.
కేంద్రం అప్పులు తీసుకోవడం లేదా.. అని మంత్రి పేర్ని నాని చేసిన ఎదురుదాడి వెనుక చాలా అర్థం ఉందని ఆర్కే చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి వేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదని ఆర్కే చెబుతున్నారు. ప్రస్తుతం జగన్‌పై తిరుగుబాటు చేసే నేతలెవరూ వైసీపీలో లేరు. చాలా మంది సీనియర్లు, వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నేతలు అసంతృప్తిలో ఉన్న మాట నిజమే కానీ ఇప్పటికిప్పుడు వారెవరూ జగన్‌కు వ్యతిరేకంగా తిరగబడే పరిస్థితి లేదని తేల్చారు. మరెందుకు బీజేపీ పై ఆరోపణలు చేస్తున్నారంటే.. బీజేపీనే అంతా కుట్ర చేసి నడిపిస్తుదని ప్రజల్ని నమ్మించడానికని ఆర్కే విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఆంధ్రజ్యోతిలో వచ్చినన్ని కథనాలు మరో మీడియాలో రావు కొత్తపలుకులోనూ ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్కే పెదవి విరిచారు. అకౌంటెంట్ జనరల్ లెక్కలు మొత్తం తీస్తే కనీసం రూ. లక్షన్నర కోట్లు ఎటు పోయాయో కూడా తెలియవని అంటున్నారు. ఆర్కే తన ఆర్టికల్‌లో ఓ లెక్క వేశారు. వచ్చిన ఆదాయం.. తెచ్చిన అప్పులు – ఖర్చు పెట్టిన మొత్తం లెక్కలు వేసి.. మిగతా సొమ్మంతా ఎటు పోయిందని ప్రశ్నించారు. బహుశా రాబోయే రోజుల్లో ఆంధ్రజ్యోతి ఈ అంశంపై సంచలన కథనాలు వెలువరించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇక అమరరాజా వివాదంపైనా ఆర్కే తనదైన శైలిలో స్పందించారు. అమరరాజా కంపెనీల అందరూ కమ్మ సామాజికవర్గం వారే పని చేస్తున్నారని.. వారికే ఉద్యోగాలిస్తారని అందుకే ఆ కంపెనీని తరిమేసిన ఇబ్బందిలేదని కొంత మంది వ్యాఖ్యానిస్తూండటంపై ఆర్కే విస్మయం వ్యక్తం చేశారు. ఆ ఫ్యాక్టరీలో పని చేసేవారు అత్యధిక మంది బీసీలేనన్నారు. అంతే కాదు కాలుష్యమని ఎవరూ ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. మొత్తానికి ఆర్కే .. తాను తన ఆర్టికల్ ద్వారా ప్రజలకు పంపాలనుకున్న సందేశం. . జగన్మోహన్ రెడ్డి త్వరలో దిగిపోతున్నారు.. అన్నదే. అది క్యారీ అయిపోయిందని అనుకోవచ్చు.