“ చంద్రబాబు ఆ రోజుల్లో ఐటీ అంటూ కలరించారు..హైటెక్ సీఎం అనే ముద్ర వేసుకున్నారు కానీ రాజకీయంగా ఆయనకు ఏమీ ఉపయోగపడలేదు.. ఇప్పుడు ఏఐ అని కలవరిస్తున్నారు..దీని వల్ల ఆయనకు లాభమేంటి…అప్పటి తప్పులే చేస్తున్నారు “ అని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తన కొత్తపలుకులో చాలా బాధపడిపోయారు. ఇటీవలి కాలంలో ఆయన పలికే పలుకుల్లో ఇవే ఎక్కువ ఉంటున్నాయి. చంద్రబాబు ఏం చేయాలి .. ఏం చేయకూడదనేది చెప్పడానికి ప్రాధాన్యమనిస్తున్నారు. వాటిని సలహాలంటారా.. మరొకటి అంటారా అన్నది ఆయనకే తెలియాలి.
అయితే ఆర్కే లాంటివారి వల్లనే చంద్రబాబు ఏఐ గురించి మాత్రమే మాట్లాడుతున్నరన్న ప్రచారం జరుగుతూ ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు ఏఐ గురించి మాట్లాడుతున్నారు. అది పేద ప్రజలకు వ్యతిరేకం అన్నట్లుగా ఓ ముద్ర వేయడానికి ఆర్కే లాంటి మేధావులు వ్యక్తం చేసే అభిప్రాయాలు ఉపయోగపడుతూంటాయి. నాడు ఐటీ అన్న చంద్రబాబు రాజకీయంగా నష్టపోయారో.. ఆ కారణంగా ఆయన ఓడిపోయారో ఎవరికీ తెలియదు..కానీ ఆ ఐటీ వల్ల కొన్ని లక్షల కుటుంబాలు మెరుగుపడ్డాయి.ఇప్పుడు ఏఐ వల్ల పాలనలోనూ ఎంతో మెరుగైన సేవలు అందించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో యువతకు నైపుణ్యం రావాలని కోరుకుంటున్నారు.
ఎందుకో కానీ చంద్రబాబు రివ్యూలు చేసినా ఆర్కేకు నచ్చదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులు ఇచ్చినా నచ్చదు. అసలు సమావేశాలే వేస్ట్ అంటారు. జగన్ రెడ్డి ఏమీ చేయకుండా .. అధికారుల్ని గాలికి వదిలేస్తే పాలన ఏమైపోయిందో చూశారు. అప్పుడువిమర్శించి ఇప్పుడు చంద్రబాబు పనులు చేయిస్తే ఫీల్ కావడం ఎందుకు?. అయినా అధికారులు జవాబుదారీగా ఉండాలంటే.. చంద్రబాబు ఇలా ఎదురుగా కూర్చుని ప్రశ్నిస్తూ ఉండాలి.లేకపోతే వారు పట్టించుకోరు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. ఆర్కే లాంటిఅతి తెలివి శ్రేయోభిలాషుల వల్లనే అప్పట్లో చంద్రబాబు ఐటీని మాత్రమే పట్టించుకున్నారన్న ప్రచారం జరిగింది.ఇప్పుడు ఏఐ పేరుతో అదే ప్రచారం చేసేందుకు ఆర్కే లాంటి వాళ్లు రెడీ అయ్యారని కొత్తపలుకు స్పష్టం చేస్తోంది.
ఆర్కే ఒక్క ఏపీకే కాదు..రేవంత్ రెడ్డికి కూడా ఇలాంటి శ్రేయోభిలాషిత్వం చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆయన పథకాలు అమలు చేసినా మైలేజీ రావట్లేదని అంటున్నారు. ఆల్ ఈజ్ నాట్ వెల్ అంటున్నారు. బీఆర్ఎస్కు ఊపిరి పోసేందుకు అవసరమైన మాటలు చెబుతున్నారు. మొత్తంగా ఆర్కే ..ఇట్లు మీ శ్రేయోభిలాషి తరహాలో ఇటీవలికాలంలో రాస్తున్న కొత్త పలుకులు… ఆయన ఇంకా పాత రోజుల్లోనే ఉన్నామన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి. ఆయన ఇంకా అప్ డేట్ కావాల్సి ఉంది.