స్కిల్ ప్రాజెక్టులో అవినీతి లేదని ఏసీబీ చెప్పింది. విజిలెన్స్ కూడా చెప్పింది. చివరికి ఇలా కాదని సీఐడీకి ఇచ్చారు. ఎక్కడా రూపాయి దుర్వినియోగం కాలేదు. ఒప్పందం ప్రకారం అన్నీ సక్రమంగా జరిగాయని ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రాజెక్టులో ఉన్నామని సీమెన్స్ చెప్పింది. కేబినెట్ ఆమోదం లేదనేది అబద్దమని బయటపడింది. స్కాం పేరుతో అరెస్టు చేసిన నిందితులెవరికీ కస్టడీకి ఇవ్వలేదు. కానీ ఏ 37కి మాత్రం ఎందుకిలా ? . ఇది వ్యవస్థల మేనేజ్ మెంట్ కాదా అని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్‌ను ప్రశ్నించారు.
ఈ వారం కొత్త పలుకులో చంద్రబాబును, లోకేష్ ను జైల్లో పెట్టి టీడీపీని లేకుండా చేయాలన్న కుట్రతోనే జగన్ రెడ్డి ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని.. దానికి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆర్కే నేరుగానే వివరించారు. స్కిల్ ప్రాజెక్టు కేసులో ఒక్క సాక్ష్యం లేకపోయినా…. చంద్రబాబు తప్పు ఉందని సీఐడీ అధికారులు చిన్న ఆధారం చూపించకపోయినా ఆయనను జైల్లో పెట్టగలిగారంటే.. వ్యవస్థలను ఎంతలా మేనేజ్ చేశారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ వారం ఆర్టికల్ మొత్తం స్కిల్ ప్రాజెక్టులో ప్రభుత్వం దాచి పెడుతున్న వాస్తవాలను బయట పెడుతూనే.. చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ పై జరుగుతున్నరాజకీయ కుట్రలను విశ్లేషించారు ఆర్కే. అసలేం జరిగిందో తెలియాలంటే నిపుణులతో విశ్లేషణ అవసరం అని హైకోర్టు తీర్పులో చెప్పిందని… మరి అలాంటప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడం ఎందుకని ఆర్కే ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీని ఫ్యాక్షనిస్టులు అడ్డంగా నరికేందుకు జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని అది జగన్ రెడ్డికే ముప్పుగా మారబోతున్నాయని ఆర్కే పరోక్షగా విశ్లేషించారు. ప్రజలు బయటకు రాకుండా.. కేసుల పేరుతో వేధిస్తున్నప్పటికీ.. స్వచ్చందంగా బయటకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఏమీ లేని కేసులో ఇలా మాజీ ముఖ్యమంత్రినే అరెస్టు చేయగలితే… వ్యవస్థల్ని మేనేజ్ చేసి .. జైల్లో ఉంచగలిగితే… ఇక సామాన్యుల సంగతి ఏమిటో చెప్పాల్సిన పనిలేదు. కార్యకర్తలే ఈ దరిద్రాన్ని వదిలించుకుంటారని.. టీడీపీని కాపాడుకుంటారని… ఆర్కే భావన అని అర్థం చేసుకోవచ్చు.