ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం ఏపీలో మహిళలు ఎదుర్కొంటున్న.. ముఖ్యంగా వైఎస్ కుటుంబంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కువ దృష్టి సారించారు. సోషల్ మీడియాలో వారిపై చెలరేగిపోతున్న వైసీపీ కాలకేయులపై తన ఆవేదన.. తల్లీ, చెల్లీని సైతం నిందింప చేస్తున్న జగన్ రెడ్డితీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతర్లీనంగా.. జగన్ రెడ్డిపై ఆయన కుటుంబసభ్యులు, మహిళలు మరింత అసహ్యం పెంచుకునేలా చేయడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డారని ఈ కథనం చదవితే అర్థమైపోతుంది. ఎందుకంటే తల్లీ శిలాన్ని శంకించమని పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఆదేశాలిస్తారా ? కానీ జగన్ రెడ్డి ఇచ్చారని సులువుగా అర్థమయ్యేలా మనకు చెప్పారు.
ఏపీలో కొంత కాలంగా వైసీపీ సోషల్ మీడియా షర్మిలను టార్గెట్ చేసుకుంది. ఆమె పేరును షర్మిలా శాస్త్రిగా మార్చి … అవమానించడం దగ్గర్నుంచి వ్యక్తిగత జీవితంలోని వ్యవహారాలన్నీ బయటకు తీస్తున్నారు. నిజానికి షర్మిల జగన్ రెడ్డి అన్నపై కేవలం రాజకీయంగా పోరాడుతున్నారు. విధానపరమైన అంశాలనే ప్రస్తావిస్తున్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా సైన్యం మాత్రం ఎవరు ఎలా ప్రశ్నించినా… తాము మాత్రం వారి వ్యక్తిగత, కుటుంబ అంశాలపై దాడి చేస్తామనే విధానానికే కట్టుబడ్డారు. చివరికి షర్మిల వైఎస్ కు పుట్టలేదన్న వాదన కూడా ప్రారంభించారు. కావాలంటే వీడియోలు ఉన్నాయంటూ సాక్షి మీడియాలో పెయిడ్ ఎనలిస్టులతో చర్చలు పెడుతున్నారు. ఇదేం వైపరీత్యం అని జనం అనుకునే పరిస్థితి.
ఇదే విషయాన్ని ఆర్కే తన ఆర్టికల్ ద్వారా ప్రజల ముందు ఉంచారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తనను చంపేయాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సునీత ఫిర్యాదు చేశారు. అదే రోజు ఏబీఎన్ లో చర్చ కూడా పెట్టారు. సునీత ఆవేదనను ప్రజల ముందు ఉంచారు. తాము ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను.. జగన్ రెడ్డి కాలకేయ సైన్యం తమపై చేస్తున్న దాడిని ఆమె ప్రజల ముందు పెట్టారు.అవే అంశాలతో కొత్త పలుకును నింపేశారు.
జగన్ రెడ్డి వ్యవహారశైలి నిజంగా సామాన్య ప్రజల్ని కూడా నివ్వెర పరుస్తోంది. రాజకీయంగా ఎదుర్కోవాల్సిన వారిని అడ్డగోలుగా తిట్లతో ఎదుర్కోవడం ఏమిటి… వారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఏమిటన్నది ఆశ్చర్యంగానే ఉండేది. అయితే జగన్ రెడ్డికి ఎవరైనా ఒక్కటే అవుతారని అనుకోలేదు. తల్లీ,చెల్లిపై సంయమనం పాటిస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేకపోవడమే వింతగా ఉంది. దాన్నే ఆర్కే హైలెట్ చేశారని అనుకోవచ్చు.