మీడియా విలువలపై దశాబ్దాలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు.. అది కొత్త పాతాళాలను చూస్తూనే ఉంది. గత నాలుగేళ్లలో మాత్రం… ఎవరూ ఊహించని లోతులకు దిగిపోయింది. అటు కేంద్రంలో.. ఇటు తెలంగాణలో.. మీడియా స్వేచ్ఛ ఉంది… అది… ప్రభుత్వం దగ్గరకు రానంత వరకు. ప్రభుత్వానికి డబ్బా కొట్టి.. ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేంత వరకూ బాగుంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా… ఆ మీడియా సంస్థల మనుగడ మీద దెబ్బ పడుతుంది. అలాంటి పరిస్థితులు భరించలేకే.. మీడియా సంస్థలు అధికారానికి లొంగిపోతున్నాయట.. ఇది ఆంధ్రజ్యోతి ఎండీ.. ఆర్కే చెప్పిన “కొత్తపలుకు”.
కక్ష సాధింపుల కారణంగ ాఒకటీ అరా మీడియాసంస్థలు మినహా మిగతావన్నీ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాయని తేల్చిన ఆర్కే.. మీడియా ఈ దుస్థితికి చేరుకోవడానికి నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడం ప్రధాన కారణమట. ప్రభుత్వాల సహకారం లేనిదే మనుగడ సాగించడం మీడియాకు దుర్లభం అయిందట. అందుకే మీడియా సంస్థలు రాజీధోరణిని అలవరచుకుంటున్నాయి. రాజకీయ, స్వీయ ప్రయోజనాలు ఉన్నవారు మీడియాలోకి జొరబడటంతో స్వతంత్రంగా పనిచేస్తూ వచ్చిన మీడియా సంస్థలు ఆటుపోట్లను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ పరిణామాలతో ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలు వెలుగుచూడటం లేదట. ఈ మాటలన్నీ చూస్తూంటే.. తను ఓ మీడియా సంస్థ అధిపతిగా..తన మీడియా ద్వారా ప్రభుత్వానికి బాకా ఊదానని ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. నిర్వహణ భారం పెరగడం… ప్రభుత్వ సహకారం కావాల్సిందేనని తీర్మానించుకోవడం.. అత్యంత చేతకాని.. వ్యవహారాలు. అలా ఉంటే.. పవిత్రమైన మీడియాలో ఎందుకు ఉండాలి..? మూసేసుకోవడమే ఉత్తమం కదా..! అలా చేయడం వల్ల సమాజానికి కీడు చేసినట్లు కాదా..?
తెలంగాణలో అవినీతి.. వైఎస్ హయాంలో జరిగిన దాని కన్నా ఎక్కువగా జరిగిందని అందరికీ తెలుసు. పేద ప్రజలకు ఇచ్చే.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని కూడా.. అడ్డగోలుగా దోచేశారు. రూ. 800కోట్లు ఎవరికి ఇచ్చారో కూడా లెక్కలు లేవు. కానీ ఒక్క మీడియా సంస్థ రాయలేదు. కానీ ఇలాంటిపనులు సోషల్ మీడియా చేస్తోందని… అందుకే.. పాలకులు వ్యవహారం బయటకు తెలుస్తుదంని ఆర్కే సంతృప్తి పడ్డారు. అయితే… ఇలా మీడియాను నయానో భయానో దారికి తెచ్చుకునే వాళ్ల కోసం… ఓ సలహా ఇచ్చారు.. ఆర్కే. ప్రధాన మీడియా వంతపాడుతోంది కదా అని భరోసాతో ఉండిపోతే ఎప్పుడో ఒకప్పుడు కొంప మునుగుతుంది. పాలకులకు భయపడి అణకువగా ఉండటం వల్ల ప్రధాన మీడియా తన విశ్వసనీయతను కోల్పోవలసిన దుస్థితి మరోవైపు ఏర్పడుతోంది. అంటే ప్రస్తుత పరిణామాల వల్ల ఉభయపక్షాలకు నష్టం జరుగుతోందని తేల్చారు. అంటే.. చివరిగా.. మీడియా పని మీడియాను చేసుకోనివ్వాలని పాలకులకు సలహా ఇచ్చారు.