ఏబీఎన్ చానల్లో ఈ వారం దగ్గుబాటి దంపతులు ఆర్కేకు ఇంటర్యూ ఇచ్చారు. చాలా కాలంగా వారు ఏబీఎన్ లాంటి చానళ్లకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మనసు మార్చుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవలి కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో ఆయన వైసీపీ తరపున పోటీ చేశారు. తరవాత బయటకు వచ్చేశారు. దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆమెకు బీజేపీలోనూ ప్రాధాన్యత తగ్గిపోయింది. పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు
అదే సమయంలో చంద్రబాబుతో ఈ కుటుంబానికి మళ్లీ కాస్త సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. దగ్గుబాటి దంపతులు తమ కుమారుడికి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకుంటున్నారు. వైసీపీ నుంచే ఇవ్వాలని చూసినా గత ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయానికి ఆయన అమెరికా పౌరసత్వం రద్దు కాలేదు. దాంతో దగ్గుబాటే అయిష్టంగా పోటీ చేశారు. కానీ ఫలితం అలాగే వచ్చింది. ఇప్పుడు వైసీపీ తరపున పోటీ చేయడానికి వారు ఆసక్తిగా లేరు. టీడీపీ తరపున కుమారుడ్ని రంగంలోకి దించాలని అనుకుంటున్నారని టీడీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో దగ్గుబాటి దంపతులు ఏబీఎన్ చానల్లో అదీ ఆర్కేకు ఇంటర్యూ ఇవ్వడంతో కీలక రాజకీయ పరిణామాలు జరగనున్నాయనేదానికి సంకేతమని భావిస్తున్నారు. ఆర్కే ఇలాంటి విషయంలో ముందు ఉంటారు. వీరి కమ్ బ్యాక్‌కు ప్రజల్లో వచ్చే సందేహాలను ఈ ఇంటర్యూ ద్వారా తీర్చే ప్రయత్నాలు చేస్తారని అనుకుంటారు. అదే జరగబోతోందేమో ఆదివారం తేలుతుంది.