ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ” ఇండియా టుడే ” మూడ్ ఆప్ ది నేషన్ పోల్‌ను ఆసరాగా చేసుకుని ఈ సారి ముగ్గురు నేతలపై తనదైన శైలిలో విజృంభించారు. రాజకీయాల్లో హత్యలుండవని ఆత్మహత్యలే ఉంటాయని ఇప్పుడు ఆ ముగ్గురూ అదే చేసుకున్నారని తేల్చేశారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ముగ్గురూ ప్రజల్లో పలుకుబడి కోల్పోయారని.. దీనికి కారణం వారి స్వయంకృతం అని తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో తేల్చేశారు ఆర్కే.
” ఇండియా టుడే మూడ్ ఆప్ ది నేషన్ “కు ఆర్కే ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం వారికి వ్యతిరేకంగా ఫలితాలు రావడమే కావొచ్చనుకోవచ్చు. వారిపై వ్యతిరేకత ఎందుకు పెరుగుతుందనే దానికి తాను ఎప్పుడూ చెప్పే కారణాలే చెబుతున్నారు. వారు ప్రజాస్వామ్య పద్దతుల్ని పాటించడం లేదని.. నియంతృత్వానికి పోతున్నారని అందుకే వారిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పుకొచ్చారు. అలా వారు చేస్తున్నారనడానికి కొన్ని ఉదాహరణలు కూడా వివరించారు. చివరికి నరేంద్రమోడీ ఆహార్యం కూడా జనానికి నచ్చడం లేదని ఆర్కే విశ్లేషించడం మరింత ఆశ్చర్యకరం. ఆయన జులపాలు,గడ్డం ఎందుకు పెంచుతున్నారో కానీ యువతలో మాత్రం వ్యతిరేకత పెరుగుతోందని చెప్పుకొచ్చారు.
ఇక కేసీఆర్ పలుకుబడి ఎందుకు తగ్గుతుందో ఆయన చాలా కాలం నుంచి చెబుతున్నారు. ఇప్పుడు నైతికంగా ఈటల కేసీఆర్‌పై విజయం సాధించేశారట. ఎందుకంటే.. ఒక్క ఉపఎన్నిక కోసం కేసీఆర్ ఇలా చతురంగ బలాలను ఉపయోగించిన సందర్భం లేదని ఆర్కే చెబుతున్నారు. నిజాలు తెలుసుకునేందుకు కేసీఆర్ ఇష్టపడకపోవడం వల్లే సమస్య వచ్చిందని ఇప్పటికైనా తెలుసుకోవాలని సలహా కూడా ఇచ్చారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంశాన్ని విశ్లేషించడానికి ఆర్కే మరింత ఉత్సాహం చూపారు. మోడీ, కేసీఆర్ ఏడేళ్ల పాలన తర్వాత ఎదురీదుతూంటే జగన్ మాత్రం రెండేళ్లకే చాప చుట్టేశారని ఎగతాళి చేశారు. ఏపీని దివాలా తీయించారని.. అప్పులు పుట్టకుండాకేంద్రం అడ్డుకుంటోందని రాసేశారు.
నిజానికి ఏడాది నుంచి రేపో మాపో ఏపీ దివాలా అని ఆర్కే తన పత్రికలో రాస్తూనే ఉన్నారు. ఇక బ్యాంకులు అప్పులివ్వబోవని కూడా చెబుతున్నారు. కానీ నెల నెలా రూ. పది వేల కోట్ల వరకూ అప్పులు తెచ్చుకుని ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా జగన్ పాలన చేస్తున్నారు. ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆర్కే చెప్పింది నిజమేనని అనుకుంటారేమో కానీ ఇప్పుడైతే మాత్రం అతిశయోక్తిగానే భావిస్తారు.