ఆ మధ్య తెలంగాణ పర్యటనకు రావాలనుకున్న హోంమంత్రి అమిత్ షా తుపాను కారణంగా రాలేకపోయారు. అప్పట్లో ఆయన షెడ్యూల్లో ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ను సంపర్క్ ఫర్ సమర్థన్ లో భాగంగా కలవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆర్కే అమిత్ షాకు రాజకీయ సలహాలు ఇవ్వాలనుకున్నారేమో కానీ… ఇప్పుడు ఆయన వచ్చి కలిసే అవకాశం లేదని… ఇప్పుడు వాటన్నింటినీ ఈ వారం ఆర్టికల్ లో పొందు పరిచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎలాంటి తప్పులు చేసిందో.. ఎంచి.. పరిస్థితి మెరుగుపడాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు.
తెలంగాణలో బండి సంజయ్ ను మార్చడం.. కిషన్ రెడ్డిని మళ్లీ పీఠంపై కూర్చోబెట్టడం ఘోర తప్పిదమని ఆర్కే తేల్చేశారు. దీని వల్ల బీజేపీ నేతల్లో నైతిక స్థైర్యం తగ్గిపోయిందని ప్రజల్లో కూడా బీఆర్ఎస్ తో ప్యాచప్ అనుమానాలు ఏర్పడ్డాయన్నారు. దర్యాప్తు సంస్థలు చల్లబడటం కూడా దీనికి కారణం అని.. ఇప్పుడు బీజేపీకి తెలంగాణలోఆశలు లేకుండా పోయాయన్నారు. అయితే నిజంగా బీజేపీ.. బీఆర్ఎస్తో ఒప్పందానికి వచ్చిందని ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీల మధ్య అలాంటి వాతావరణం అంటూ ఏర్పడితే లాభపడేది కాంగ్రెస్సే. ఆ మాత్రం వారికి తెలియదా అంటున్నారు. మొత్తంగా తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకోవాలంటే దర్యాప్తు సంస్థల సాయం కావాల్సిందేనని ఆర్కే తేల్చేశారు.
ఇక ఏపీ బీజేపీకి పురందేశ్వరిని చీఫ్ గా ఎందుకు నియమించారో ఆర్కే కు కూడా అర్థం కాలేదు. కానీ సోము వీర్రాజు తొలగింపులో ఆలస్యం చేశారని అందుకే… ఇక బీజేపీకి అక్కడ చాన్స్ లేదని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి బీజేపీ… టీడీపీ, వైసీపీతో అంట కాగుతోందని.. కానీ ఇది సరైన స్ట్రాటజీ కాదని ఆయన అంటున్నారు. ఏపీ గెలవాలంటే.. ఏపీ నిలబడాలంటే.. టీడీపీ వైపు ఉండాలని ఆయన సూచిస్తున్నారు. కానీ.. నేరుగా పొత్తు పెట్టుకుంటే టీడీపీకి నష్టమని. .. గత ఎన్నికలలో వైసీపీకి సహకరించినట్లుగా బీజేపీ ఇప్పుడు టీడీపీకి సహకరించాలని సలహా ఇచ్చారు.
కారణం ఏదైనా భారతీయ జనతా పార్టీపై సానుభూతి చూపించారు కానీ…. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఆర్కే తన మీడియాతో కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అలా చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహాలిచ్చారు. మరి బీజేపీ హైకమాండ్ ఏం చేస్తుందో ?