రెండు రోజుల క్రితం ఏబీఎన్ రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ప్రచురించిన వ్యాఖ్య రాజకీయ వర్గంలో తీవ్ర కలకలం సృష్టించింది. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జనసేనకు ఇతోధికంగా మేలు చేశాయి అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాలలో తాజాగా వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్ కి కెసిఆర్ వేయి కోట్ల ప్యాకేజీ కథనం:
రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం పై కొత్త ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవి విషయంలో తెలుగుదేశం పార్టీతో కచ్చితంగా పవర్ షేరింగ్ ఉండేలా కెసిఆర్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ కి బ్రెయిన్ వాష్ చేస్తున్నారని, ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇందుకు ఒప్పుకోకపోతే, పవన్ కళ్యాణ్ కి ఎన్నికలలో సాయపడడానికి 1000 కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఏబీఎన్ రాధాకృష్ణ తన కథనం లో ఆరోపించారు. అయితే హఠాత్తుగా, అందులోనూ తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు రేపు మాపో కుదరడం దాదాపు ఖాయం అని అందరూ అనుకుంటున్న సమయంలో, తెలుగుదేశం పార్టీకి అనుకూలురు గా పేరు ఉన్న రాధాకృష్ణ ఇటువంటి ఆరోపణలు చేయడం వెనుక పవన్ కళ్యాణ్ కి ముందరి కాళ్ళ బంధం వేసే వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తుకు ఏకైక ఆటంకం:
2019 ఎన్నికలలో చిత్తు అయినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన స్థానిక ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీ కంటే జనసైనికులే ధైర్యంగా జగన్ కి ఎదురొడ్డి నిలబడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత అయిన చింతమనేని ప్రభాకర్ లాంటివాళ్ళు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో జగన్ వర్సెస్ పవన్ అన్న రీతిలో పరిస్థితి తయారైంది అనుకునే లోపు, “2024 లో వ్యతిరేక ఓటు చీలనివ్వను” అని పవన్ కళ్యాణ్ స్వయంగా వ్యాఖ్యలు చేయడం కారణం గా కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. ఈ వ్యాఖ్యల అనంతరం తెలుగు దేశం పార్టీలో సైతం కొత్త జోష్ లో వచ్చింది. ఇదే సమయంలో జగన్ ప్రభ తగ్గుతోందని వచ్చిన పలు అంతర్గత నివేదికలు విపక్షాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. జగన్ కి వ్యతిరేకంగా పవన్ చంద్రబాబు కూటమి కట్టడం ఖాయం అన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే ఈ కొత్త పొత్తులో ప్రధానమైన చిక్కుముడి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నదే. చంద్రబాబు సీనియర్ నాయకుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన కంటే పెద్ద పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబే అని ఆ పార్టీ నాయకులు, అభిమానులు అభిప్రాయపడుతుంటే, 2014లో నిస్వార్ధంగా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని, ఈసారి మొదటి రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే పక్షంలో మాత్రమే జనసేన టిడిపిల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందని, అలా కాదన్న పక్షంలో పొత్తు పెట్టుకుని కూడా ప్రయోజనం ఉండదని జనసేన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోయి జగన్ లాభపడతాడని, తెలుగుదేశం పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద కక్షపూరిత ధోరణి ప్రదర్శించిన జగన్ అదే తీరు కొనసాగించి, తెలుగు దేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడానికి ప్రయత్నిస్తాడని, కాబట్టి ఈ పొత్తు తమ పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీకే ఎక్కువ అవసరం అని జనసేన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ కు ముందరి కాళ్ళ బంధం వేసేలా ఏబీఎన్ ఆర్కే వ్యూహం:
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యూహాలకు చెక్ పెట్టేలా, పవన్ కు ముందరి కాళ్ళ బంధం వేసేలా తెలుగుదేశం పార్టీ మరియు ఏబీఎన్ రాధాకృష్ణ కలిసి ఈ ఎత్తుగడ వేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను అని చెప్పడం ద్వారా ఇక జగన్ ప్రభుత్వం రావడం కష్టమేమో అన్న ఆలోచనను ప్రజల మస్తిష్కాలలోకి చొప్పించడమే కాకుండా, ఆ పార్టీకి బలమైన ఆయుధంగా ఉన్న అనేక మీడియా సంస్థలు జనసేన పార్టీ పట్ల సానుకూల వైఖరి కనపరిచేలా, జనసేన పార్టీకి మద్దతుగా నిత్యం వార్తా కథనాలు ఇచ్చేలా పవన్ చేసుకున్నాడని, మరి రాబోయే ఏడాది మొత్తం ఈ అడ్వాంటేజ్ ని ఇలాగే వాడేసుకుని, ఆఖరి మూడు నెలల్లో తాను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా వెళతానని పవన్ ప్రకటిస్తే అది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుందని, అటువంటి పరిణామాన్ని నిలువరించడానికి ఏబీఎన్ రాధాకృష్ణ కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ అన్న కథనాన్ని తెరమీదకు తీసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే, కెసిఆర్ మాట విని పవన్ కళ్యాణ్ ఆఖరి నిమిషంలో పొత్తు పెట్టుకోలేదు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే, అది తెలుగుదేశం పార్టీకి లాభిస్తుంది అని, అంతేకాకుండా కెసిఆర్ జగన్ కోసం ఇలాంటి వ్యూహాన్ని అమలుపరుస్తున్నాడు అని చెప్పడం ద్వారా జగన్ వ్యతిరేక ఓటు పూర్తిగా తెలుగుదేశం పార్టీకే పరిమితం అయ్యేలా ఈ కథనాన్ని రూపుదిద్దారని వారు అభిప్రాయపడుతున్నారు.
ఏబీఎన్ కథనం జనసేనకు మేలు చేసిందా?
అయితే ఈ కథనాన్ని చూడగానే ఆ గ్రహవేశలతో ఊడిపోయిన సామాన్య జనసేన కార్యకర్తలు సైతం ఒకటి రెండు రోజులకే విషయాన్ని అవగతం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తమ ఓట్లను అప్పనంగా చంద్రబాబుకు అప్పగించడానికి సిద్ధంగా లేడని, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో ఖచ్చితమైన స్పష్టత తో వ్యవహరించడం వల్లే తెలుగుదేశం పార్టీ కి అనుకూలుడు అన్న ముద్ర కలిగిన ఏబీఎన్ రాధాకృష్ణ వంటి వారు ఈ తరహా కథనాలను తెరపైకి తీసుకువచ్చి ఉంటారని వారు భావిస్తున్నారు. అవసరమైతే అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ అత్యంత పరిణితితో పవన్ కళ్యాణ్ పొత్తు అంశాన్ని డీల్ చేస్తున్నాడు అన్న అభిప్రాయాన్ని జనసైనికులు వ్యక్తపరుస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఒకవేళ రాబోయే ఎన్నికలలో పొత్తు పెట్టుకున్నప్పటికీ, జనసేన పార్టీ ప్రయోజనాలకు అగ్ర తాంబూలం వేసే విధంగా ఆ పొత్తు ఉండనుంది అన్న క్లారిటీ జనసైనికులలో కొత్త జోష్ నింపుతోంది. మరి ఈ రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు రాబోయే కాలంలో ఏ విధంగా మారనున్నాయి అన్నది వేచి చూడాలి.
– జురాన్