ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై జనసేన, బీజేపీ మైండ్లను ట్యూన్ చేసే ప్రయత్నాలను ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రారంభించారు. తన వారాంతపు ఆర్టికల్ ” కొత్తపలుకు”లో తాను రెండు పార్టీలకు చెప్పాలనుకున్నది చెప్పడమే కాదు.. బీజేపీ హైకమాండ్ కూడా మనసు మార్చుకుంటోందని.. టీడీపీతో పొత్తుకు రెడీ అవుతోందని కొన్ని కారణాలు చెప్పారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ చేసిన మూడు ఆప్షన్ల ప్రకటన వ్యూహాత్మకంగా ఎంత తప్పిదమో కూడా వివరించే ప్రయత్నం చేశారు.
ఈ వారం ఆర్కే “కొత్తపలుకు”లో అన్ని పార్టీలకు పరోక్ష సందేశాలే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. మహానాడు సక్సెస్ తర్వాత వార్ వన్‌సైడ్ అంటున్న టీడీపీ అధినేతకూ ఆయన పరోక్షంగా సలహా పంపించారు. పెద్ద ఎత్తున డబ్బులు, అధికార దుర్వినియోగానికి పాల్పడనున్న జగన్‌ను తట్టుకోవాలంటే కేంద్రంలో అధికారం మద్దతుగా ఉండాలన్న సందేశాన్ని పంపించారు. బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీలో అంత సానుకూలత లేదు. జనసేనతోనూ పొత్తు వద్దని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు కూడా ఇటీవలి కాలంలో పొత్తుల మాటలు తగ్గించారు. ఇది మంచిది కాదని కలసి పోటీ చేయాలని ఆర్కే తన ఆర్టికల్ తన సందేశాన్ని పరోక్షంగా పంపారని అనుకోవచ్చు.
పవన్ కల్యాణ్ రహస్యంగా ఢిల్లీ వెళ్లి ఏపీ వ్యవహారాలు చూసే బీజేపీ ముఖ్యులతో సమావేశాలు జరిపి ఏపీలో పరిస్థితిని వవరించారు. వైసీపీని ఓడించాలంటే ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని తీరాల్సిందేనని చెప్పారన్న కొత్త విషయమూ ఆర్కే చెప్పారు. పవన్ కల్యాణ్ అలా చెప్పారో లేదో తెలియదు కానీ.. పవన్ చెప్పిన విషయంలో మ్యాటర్ ఉందని బీజేపీ హైకమాండ్ భావిస్తోందని.. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని నిర్ణయానికి వచ్చిందని భావిస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ఓట్లు చీలనివ్వబోమని ప్రకటన చేసిన తర్వాత షరతులు పెట్టడం ఏమిటన్నవాదన కూడా తీసుకొచ్చారు. ముందే చెప్పాల్సిందన్నారు.
మొత్తంగా పొత్తుల విషయంలో దూర దూరంగా ఉంటున్న పార్టీలను ఆర్కే తన ఆర్టికల్ ద్వారా దగ్గర చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితుల్ని వివరించి వారి మైండ్‌ను ట్యూన్ చేసే బాధ్యతను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. మరో వైపు ఎప్పట్లాగే జగన్ తీరును.. ఆ పార్టీ నేతల తీరును కూడా సుదీర్ఘంగా విశ్లేషించారు. పతనానికి చాలా స్పష్టమైన సంకేతాలున్నాయని తేల్చేశారు.