ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్తపలుకులో న్యాయవ్యవస్థకు సూటి ప్రశ్నలు వేశారు. అది కూడా సుప్రీంకోర్టుకు. కంచ గచ్చిబౌలి కేసును సుమోటోగా తీసుకోవడమే కాదు.. చీఫ్ సెక్రటరీని జైలుకు పంపిస్తామని చేసిన వ్యాఖ్యలపై ఆర్కే ఆశ్చర్యం వ్యకం చేశారు. ఆ వ్యాఖ్యలు ఆదేశాల్లో లేకపోవడంపైనా ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి స్థలాల్లో ఉన్న చెరువు పక్కనే కట్టబోయే జైల్లో వేస్తామని సీఎస్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారు. ఇలాంటి అసలు ఎలా చేస్తారన్నది ఆర్కే ప్రశ్న.
ఆర్కే న్యాయస్థానాలు కూడా ఒక్కొక్కరి పట్ల ఒక్కోలా స్పందిస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీలో జగన్ రెడ్డి సీఎంగా ఉన్న పర్యవరణాన్ని పూర్తి స్థాయిలో విధ్వంసం చేసేవాడని గుర్తు చేశారు. ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడ చెట్లు కొట్టేసేవారు. అంతేనా రుషికొండ ప్యాలెస్ విషయంలో జరిగిన ఉల్లంఘనలు ఎప్పటికప్పుడు న్యాయస్థానాల దృష్టికి వచ్చినా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు సరి కదా.. ఆపలేకపోయారని ఆర్కే వాదన.
తెలంగాణ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ తన సర్వీస్ మొత్తంలో క్లీన్ గా ఉన్నారని..రిటైరవ్వబోయే ముందు సుప్రీంకోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆర్కే అభ్యంతరం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చట్టాలను బట్టి మాత్రమే తీర్పులు చెప్పాలి కానీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆర్కే ప్రశ్నిస్తున్నారు. తీర్పుల విషయానికి వచ్చే సరికి.. న్యాయమూర్తులు చేసే కామెంట్స్ తీర్పుల్లో ఉండకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల విషయంలో బహిరంగంగా ఎవరూ చర్చించకపోయినా.. అంత సీరియస్ గా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటన్న అభిప్రాయం అంతర్గతంగా ఉంది. ముందుగా అవి అటవీ భూములు కాదనే ప్రాథమిక విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించలేకపోయిందని.. చీఫ్ సెక్రటరీపై దారుణమైన వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం ఉంది. అయితే న్యాయవ్యవస్థను గట్టిగా ప్రశ్నించడానికి ప్రయత్నించిన ఆర్కే… అలాగే ప్రశ్నిస్తున్న మమతా బెనర్జీ ఇష్యూ మర్చిపోయారు. బెంగాల్ లో టీచర్ల నియామకాలను రద్దు చేసిన జడ్జి బీజేపీలో చేరి ఎంపీ అయ్యారు. ఆయన ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పాతిక వేల మందికిపైగా టీచర్లు రోడ్డున పడ్డారు. నోట్ల కట్టల జడ్జి ని బదిలీ చేసినట్లుగా వీరిని కూడా బదిలీ చేయవచ్చు కదా అని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇంకా చాలా ప్రశ్నలు వేశారు. ఆర్కే మమతా బెనర్జీ ప్రశ్నలను కూడా తనకు వాదనగా తీసుకుంటే ఆయన ఆర్టికల్ కు మరింత బలం వచ్చి ఉండేది.