ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ …తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా సలహా పంపారు. ఇక కూల్చివేతలు ఆపేయాలని సూటి సలహా ఇచ్చారు. లేకపోతే కూల్చివేతల ప్రభుత్వం అని ముద్ర పడిపోతుందని హెచ్చరించారు. పెద్ద వాళ్ల ఫామ్ హౌస్లు కూల్చినప్పుడు వ్యతిరేకత వచ్చింది కానీ.. మూసీ నదిని ఆక్రమించిన వారివి కూలగొడుతున్నప్పుడు మాత్రం ప్రజా వ్యతిరేకత వచ్చిందని స్పష్టంచేశారు. కూల్చివేతల ప్రభుత్వం అనే ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని జాగ్రత్తపడాలని ఆయన సలహా ఇచ్చారు.
తన సలహా పాటించేలా ఆయన మైండ్ గేమ్ కూడా కొత్తపలుకులో ఆడారు. బీఆర్ఎస్ బలపడుతోందని ఆయన చెప్పారు. దానికి కారణం .. హరీష్ రావు, కేటీఆర్ దూకుడు పెంచడం.. బీజేపీ ఏ మాత్రం యాక్టివ్గా లేకపోవడమేనని అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో ఆశలు పెరిగాయని అందుకే వలసలు కూడా తగ్గాయని చెబుతున్నారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ ఖాళీగా లేడని.. బుర్రకు పదును పెడుతున్నారని కూడా హెచ్చరించే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి పలు తప్పులు చేస్తున్నారని కూడా ఆర్కే చెబుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ వాడిన భాషను ఇప్పటికి వాడటాన్ని ప్రజలు హర్షించరని చెబుతున్నారు. అంతే కాదు ఆయనకు చాలా గుదిబండలు ఉన్నాయని అందులో మొదటిది హైకమాండేనని కూడా తేల్చేశారు. రేవంత్ కు ప్రభుత్వంపై.. పార్టీపై పట్టు చిక్కకుండా.. హైకమాండ్ల చేస్తున్న రాజకీయంతో ఆయన బలహీనపడిపోతున్నారని.. జాగ్రత్త పడాలని కూడా సలహా ఇచ్చారు.
అసలు ఈ వారం ఆర్కే కొత్త పలుకులో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. కేసీఆర్ అవినీతిపై అసలు చర్యలే తీసుకోకుండా వదిలేయాలనడం. రాజకీయ అవినీతిని ప్రజలు సీరియస్ల గా తీసుకోవడం లేదని కాళేశ్వరంలో అవినీతి నిరూపించినా కేసీఆర్ కు ఫరక్ పడదని తేల్చేశారు . కేటీఆర్, హరీష్ టార్గెట్ గా రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అవి వాళ్లను మరింత బలపరుస్తాయని రేవంత్ విషయంలో కేసీఆర్ అనుసరించిన ధోరణి గురించి చెప్పుకొచ్చారు.
ఎలా చూసినా.. రేవంత్ రెడ్డికి ఆర్కే చాలా సలహాలు ఇచ్చారు. ఆ సలహాల సారాంశం…. అన్ని విషయల్లోనూ వెనుకడుగు వేయమనే… కూల్చివేతలు.. అవినీతిపై విచారణలు ఇలా. రేవంత్ సంగతేమో కానీ.. ఆర్కే ఈ ఆదివారం బీఆర్ఎస్కు బూస్ట్ ఇచ్చాడనుకోవచ్చు.