ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పత్రికల అధినేత ఆర్కే లేక రాధాకృష్ణ దమ్మున్న సంస్థలుగా ప్రచారం చేసుకున్నారు. చాలా విషయాలు ధైర్యంగా ప్రచురించారు కూడా. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదట్లో తెలుగుదేశం అనుకూల టిఆర్ఎస్ వ్యతిరేక పాత్ర నిర్వహిస్తున్నారనే కోపంతో ఆ ఛానల్‌ను చాలా కాలం రాకుండా చేశారు. దాన్ని అందరూ ఖండించారు కూడా. ఏడాది తర్వాత ఎలాగో సర్దుకున్నారు. సర్దుబాటు షరతులేమిటో తెలియదు గాని కెసిఆర్ యాగానికి కూడా ఆర్కే వెళ్లివచ్చారు.(వచ్చాక ఒకింత విమర్శనాత్మకంగానే రాశారు) ఇప్పటికి పరిశోధనాత్మక కథనాలు ధారావాహికలు వస్తున్నా క్రమేణా కథనాల్లోనూ అదివరకటి శైలి మారింది. ఎవరికైనా మనుగడ ముఖ్యంగనక ఒకే అనుకోవచ్చు. కాని నిర్మొహమాటంగా విమర్శిస్తారని ప్రచారంలో వున్న ఆర్కే కొత్తపలుకులోనూ ఇటీవల కెసిఆర్ గురించి రాసేప్పుడు ఆచితూచి అధికంగా పొగడ్ద అల్పంగా విమర్శ చేస్తున్నారని పాఠకులకు తెలిసిపోతున్నది. ఈ ఆదివారం తిెరుగులేని కెసిఆర్(లా జవాబ్) శీర్షిక గాని విషయం గాని చదివితే పూర్తిగా ఇది రాశాక ఆర్కేసిఆర్ అనాలనిపిస్తుందని ఒక విమర్శకుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు మీద ఎలాగూ విమర్శలు నామమాత్రమే.ఇక కెసిఆర్‌ను కూడా భుజాని కెత్తుకుంటే మరో అగ్రశ్రేణి తెలుగు పత్రికలాగే ఇది కూడా మారిపోతుందని అభిమానులు భయపడుతున్నారు.మరి ఆర్కే ఏమాలోచిస్తున్నారో?