ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో జగన్ రెడ్డి రాజకీయ విన్యాసాల గురించి తనకు ఉన్న సమాచారమో.. లేకపోతే ఇలా జరుగుతోందా అని ఊహించి రాశారో కానీ బ్లాస్టింగ్ లాంటి అంశమే రాశారు. జగన్ రెడ్డి వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేలా ఒప్పందం చేసుకున్నారని… కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆర్థిక సాయం కూడా చేశారని ఆర్కే చెబుతున్నారు డీకే శివకుమార్ తో పాటు మరో కర్ణాటక నేత అయిన కేసీ వేణుగోపాల్ ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారని చెబుతున్నారు.
తాను చెప్పేది నిజం అనే సాక్ష్యాలుగా ఆర్కే… షర్మిలకు ఎదురవుతున్న పరిస్థితుల గురించే చెప్పారు. ఏపీలో రాజకీయం చేయడానికి షర్మిల రెడీ అయినా.. ఇప్పుడు కాంగ్రెస్ రెడీగా లేదట. పగ్గాలిచ్చేందుకు రెడీగా లేమని. . అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టలేమని రాహుల్ అన్నారని ఆర్కే చెబుతున్నారు. దీంతో షర్మిల షాక్ కు గురయ్యారు. అంతే కాదు… పార్టీని విలీనం చేసి ఖాళీగా ఉండాలని తెలంగాణలో పోటీ కూడా చేయవద్దని చెప్పినట్లుగా ఆర్కే చెబుతున్నారు. షర్మిలకు అనధికారిక సలహాదారుగా ఆర్కే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆర్కే చెప్పివన్నీ నిజమవుతున్నాయి. అందుకే ఆర్కే చెప్పిన ఈ విషయం కూడా సంచలనంగా మారడం ఖాయంగానే కనిపిస్తోంది.
నిజానికి వైసీపీ.. ఇండియా కూటమితో చర్చలు జరుపుతోందని ఢిల్లీలో గత పది రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలతో ఈ మేరకు సంప్రదింపులు జరిగాయని అంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు కూటమిలో చేరడం సాధ్యం కాదని ఎన్నికల తర్వాతనే మద్దతిస్తామని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో ఢిల్లీ రాజకీయవర్గాలు కాస్త క్లారిటీగానే ఉన్నాయి.
అయితే జగన్ రెడ్డి రాజకీయం క్లియర్ గానే ఉంది. తమకు చక్రం తిప్పే సీట్లు వస్తే…. తమకు మేలు చేసే పార్టీ వైపే మొగ్గుతామని జగన్ రెడ్డి నిర్మోహమాటంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల తరవతా ఆయన పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. మోడీ గెలిస్తే ఆయనకు మరో మాట లేకుండా మద్దతు ప్రకటిస్తారు. అవసరం అయితే కాంగ్రెస్ పై బండలేస్తారు. కాంగ్రెస్ గెలిస్తే…. రాహుల్ ను పీఎం చేయడం తన నాన్న కల అని చెప్పి ఆ వైపు మారిపోతారు. అందులో డౌటే లేదు. ఎందుకంటే జగన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వంలో వైరం పెట్టుకునే ఆప్షన్ లేదు.
అయితే ఇప్పుడు కేంద్రం నుంచి సహకారం అందుతోంది . ఇప్పుడే కాంగ్రెస్ కు సంకేతాలు పంపినట్లుగా తెలిస్తే బీజేపీ ఆగ్రహిస్తుంది. దాంతో సహకారం ఆగిపోతుది అదే జరిగితే… ఇబ్బందులు పడతారు. ఆర్కే వ్యూహం ఇదే కావొచ్చునని కొంత మంది సందేహాలు సహజంగానే వస్తున్నాయి.