” జగన్ ఏదైనా చేయగలరు. ఆయనకు సామర్థ్యం ఉంది ” అని సర్టిఫై చేయడానికే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకు ఆర్టికల్‌ను కేటాయించారు. అయితే ఆయన తన సొంతానికి తాను చేసుకుంటున్నారు కానీ ఓట్లేసిన ప్రజల కోసం.. రాష్ట్రం కోసం ఏమీ చేయడం లేదని తీర్పిచ్చారు. అసెంబ్లీలో అమరావతి గురించి.. మూడు రాజధానుల గురించి జగన్ మాట్లాడిన అంశాల విశ్లేషణకు ఈ వారం అధిక భాగం కేటాయించిన ఆర్కే.. అమరావతిని కట్టలేనన్న జగన్ ప్రకటన అబద్దమని.. ఆయనకు ఆ సామర్థ్యముందని గట్టిగానే విశ్లేషించారు.
ఒకప్పుడు సండూర్ పవర్ అనే కంపెనీలో కాసిన్ని పెట్టుబడులు పెట్టడానికే ఇల్లు తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి. బడా కాంట్రాక్టర్ల వద్ద సబ్ కాంట్రాక్టులు చేసే వ్యాపారం ఉన్న జగన్ అనతి కాలంలో వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ని తెలివి తేటలు ఉన్న జగన్.. అన్ని వనరులు.. భూమితో సహా అందుబాటులో ఉంటే.. అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేరని ఆర్కే ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నలో చాలా లాజిక్కులున్నాయి. అందులో ఒకటి జగన్ చేయగలరు కానీ చేయలేరు. రెండు.. ఆయన చేసుకుటున్నారు.. కానీ సొంతానికి. మూడు ఆయన అసలు రాష్ట్ర సొమ్మునే వాడేసుకుని సొంతం చేసుకుంటున్నారు.. అనే విషయాల్ని ప్రజల మైండ్లోకి పంపే ప్రయత్నం చేశారు.
రాజధాని విషయంలో జగన్ ఓ సీఎం మాట్లాడకూడని మాట్లాడారు. తాను చేయలేను అని చేతులెత్తేస్తే అది ఆ సీఎంకు చెరపలేని మచ్చ అవుతుంది. కానీ సీఎం జగన్ ఒక్క రాజధాని అంశంలోనే కాదు మద్య నిషేదం, సీపీఎస్ రద్దు సహా అనేక అంశాల్లో తాను చేయలేనని అంటున్నారు. ఇదే విషయాలను పరోక్షంగా గుర్తు చేస్తూ.. తాను ఆయన చేయలేకపోవడం కాదని చేయరని.. ఆర్కే విశ్లేషించారు. ఆర్కే పలుకు నేరుగా చదివిన వారికి అవును కదా జగన్‌లో ఇంత సామర్థ్యం ఉంది కదా అనే అనిపిస్తుంది. కానీ లోతైన అర్థాలు తెలుసుకున్న వారికి.. హమ్మ.. జగన్ ఇంత దారుణమైన వ్యక్తా అని అనిపించక మానదు.
అదే సమయంలో ఈ వారం కేసీఆర్‌కూ సలహాలిచ్చారు. కేసీఆర్ జాతీయ పార్టీ నేతలతో భేటీ అవడాన్ని అపహాస్యం చేశారు. షెడ్డుకెళ్లిపోయిన నేతల్ని ప్రత్యేక విమానాల్లో పిలిపించుకుని పొగిడించుకుంటే ఏం వస్తుందని.. ఆ విషయం రేపు రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే తెలిసిపోతుందంటున్నారు.