ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మార్పించాలని సీఎం జగన్ ను బీజేపీ పెద్దలు చాలా కాలంగా కోరుతున్నాని మూడు వారాల కిందటే ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తన కొత్త పలుకులో రాశారు. అది నిజం అయింది. మూడు వారాల్లోనే శరత్ రెడ్డి అప్రూవర్ అయ్యారు. అయితే ఇలా అప్రూవర్ గా అంగీకరింపచేయడంలో జగన్ సాధించేది ఏమిటి అంటే.. వివేకా కేసులో జరుగుతున్న దూకుడు అడ్డుకట్టడం అనేది మన కళ్ల ముందే ఉంది. అయితే ఆర్కే ఇదొక్కటే కాదు.. కవిత కూడా సేఫే అని చెబుతున్నారు. శరత్ రెడ్డి అప్రూవర్ అయితే కవిత ఎలా సేఫ్ అవుతుందన్నది మాత్రం నమ్మేలా వివరించలేకపోయారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం స్వరూపం చూస్తే వ్యవస్థీకృత నేరం. బీజేపీ ఈ కేసులో మొదట కవితనే టార్గెట్ చేసింది. అసలు సీబీఐ విచారణ ప్రారంభించక ముందు బీజేపీ సోషల్ మీడియా కవితను లిక్కర్ క్వీన్ గా ప్రమోట్ చేసింది. స్కాంలో ఆమె ఏమేం చేశారో కూడా బయట పెట్టారు. శరత్ రెడ్డి గురించి కూడా .. ట్రెండ్ చేశారు. సీబీఐ, ఈడీ విచారణలో అన్నీ బయటకు వచ్చాయి. మెల్లగా ఓ సారి కేజ్రీవాల్ నూ ప్రశ్నించారు. ఇప్పుడు కవితను ఎలా సేఫ్ చేస్తారన్నది ఆర్కే లాజికల్ గా చెప్పలేకపోయారు. ఇప్పటికే కవిత గురించి మొత్తం ఆధారాలను కోర్టుకు వివరించాురు. మరో వైపు సుకేష్ చంద్రశేఖర్ లేఖలు రాస్తున్నారు. షెల్ కంపెనీల గురించీ చెబుతున్నారు.
ఎలా చూసినా ప్రస్తుతానికి కేజ్రీవాల్ పై ఉన్న ఆధారాల కంటే… కవితపై ఉన్న ఆధారాలే ఎక్కువ. ఒక వేళ కవితను సైడ్ చేసేసి.. కేజ్రీవాల్ ను మాత్రమే ఇరికించాలనుకుంటే కేసు బలహీనం అయిపోతుంది. అప్పుడు అందర్నీ వదిలిసినట్లవుతుంది. బీజేపీ . కేసులతో రాజకీయం చేస్తుదంన్నది మాత్రం కళ్ల ముందు కనిపించే నిజం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… ఆర్కే… కవితను అరెస్ట్ చేయకపోతే ఈ కథనం నిజం అని చెప్పుకొచ్చారు. బహుశా… ఆయన టార్గెట్ కవితను కూడా వదిలి పెట్టకూడదని.. .అందుకే ఇలా రాశారన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది.
మరో వైపు న్యాయవ్యవస్థపై ఏబీఎన్ చానల్ లో మాట్లాడిన వారి మాటలపై న్యాయమూర్తి వ్యక్తం చేసిన ఆగ్రహంపై ఆర్కే స్పందించారు. న్యాయవ్యవస్థపై ఎందుకు అనుమానాలు వస్తున్నాయో చాలా సూటిగానే చెప్పారు. బెయిల్ విచారణలో కేసు మెరిట్స్ లోకి వెళ్లి వ్యాఖ్యలు చేయడం…. అవినాష్ బెయిల్ పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పట్టించుకోకపోవడం… వంటివి నేరుగానే ప్రస్తావించారు. న్యాయవ్యవస్థ పనితీరును గట్టిగానే ప్రశ్నించారు.