తెలంగాణ సీఎం కేసీఆర్ , ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మంచి మిత్రులు. అరే.. ఒరే అని పిలుచుకునేంత సాన్నిహిత్యం వారి మధ్య ఉంది. అయితే ఇది కేసీఆర్ పదవిలోకి రాక వరకే. పదవిలోకి వచ్చాక కేసీఆర్ కూ… ఆర్కేకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొదట్లో టీడీపీ ఉంది కాబట్టి ఆ పార్టీకి ఆర్కే సపోర్ట్ చేశారని .. టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు టీడీపీ లేకపోయినా కేసీఆర్ ను మాత్రం ఆర్కే వదిలి పెట్టడం లేదు. దీంతో కేసీఆర్ కూడా కోపం వచ్చింది. కేసీఆర్ కు కోపం గవర్నర్ ను అయినా పట్టించుకోరు. అవసరం వస్తేనే మళ్లీ ఆలోచిస్తారు. ఇలాంటి కేసీఆర్ మనస్థత్వాన్ని ఆర్కే విశ్లేషించారు.
ఈ వారం ఆర్కే కొత్త పలుకు పూర్తిగా కేసీఆర్ చేతిలో మోసపోయిన రాజకీయ నేతల జాబితా గురించి చెప్పడానికేనన్నట్లుగా ఉంది. ఆయనను నమ్మిన వారంతా నట్టేట మునిగిపోతారని కానీ ఆయన మాత్రం… వారిని తొక్కేసి పైకి ఎదుగుతారని వివరించారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ రాజకీయ చరిత్రలో.. ఆలె నరేంద్రతో ప్రారంభించి.. ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాం, విజయవాడశాంతి… ఇలా చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ఆర్కే ఇంకా చాలా పేర్లను మిస్సయ్యారని ఇతరులు ఆ కోణంలో చెప్పవచ్చు. ఇక కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఇటీవల రాజకీయ విన్యాసాలనూ ప్రస్తావించారు. శరద్ పవార్ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిస్తే ఇప్పుడు ఆయన పార్టీ నేతల్ని డబ్బులిచ్చి మరీ తన పార్టీలో చేర్చుకుంటున్నారని ఆర్కే చెప్పుకొచ్చారు. అందుకే కేసీఆర్ అథమస్థాయి నాయుకడని తేల్చారని ఆర్కే ప్రకటించారు.
ఒక్క పవార్ మాత్రమే తాజాగా కమ్యూనిస్టులు బలయ్యారని… ఇప్పుడు కేసీఆర్ నిన్నటిదాకా… గవర్నర్ ఉనికిని సహించలేని కేసీఆర్ ఇప్పుడు గవర్నర్ కు అతిథిమర్యాదలు చేస్తున్నారని… ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పారు. మధ్యలో తుమ్మల , మోత్కుపల్లి, మండవ వంటి వారిని ఎలా ఉపయోగించుకున్నారో వివరించారు. అవసరం ఉంటే … ఇంటికైనా వెళ్లి పార్టీలో చేర్చుకోవడం లేదంటే కనీసం ప్రగతి భవన్ గేటు కూడా తీయకపోవడం.. ఆయన శైలి అని ఆర్కే తేల్చేశారు. ఆర్కే కొత్తపలుకులో ఒక్కటి కూడా తప్పు అని ఎవరూ అనుకోరు. అన్నీ నిజాలే. అందుకే కేసీఆర్ మోసం చేయడంలో తప్పేమీ లేదని.. అది ఆయన రాజకీయ నైజమని పదే పదే మోసపోయేవారిదే తప్పని తేల్చేశారు.
రాజకీయం అంటేనే అంత. కేసీఆర్ ను నమ్మిన వారు … ఊరకనే నమ్మలేదు. తమకేదో ఊహించని మేలు చేస్తారని ఆశపడి వచ్చారు. ఆ నేత కేసీఆర్ ఆశించినంత మేలు చేయకపోతే… కేసీఆర్ మాత్రం నెత్తిన ఎందుకు పెట్టుకుంటారు ? . మండవ అయినా… మోత్కుపల్లి అయినా… తుమ్మల అయినా… వారి వల్ల ఉపయోగం లేదనే పక్కన పెట్టేశారని.. .. అది రాజకీయమని ఇతరులు సమర్థిస్తారు. ఆర్కే కూడా అదే చెబుతున్నారు. కానీ… ఆయన చెప్పిన కోణం వేరే పద్దతిలో ఉంటుంది. మొత్తంగా కేసీఆర్ ను రాజకీయంగా నమ్మి అడ్రస్ లేకుండా పోయిన వాళ్లు లెక్క లేనంత మంది ఉంటారు.
ఆర్కే తన ఆర్టికల్ యాప్ట్ అయ్యే ఓ అంశాన్ని మర్చిపోయారు.. లేకపోతే దానిపైనా ఓ విశ్లేషణ చేసి ఉండేవారు… కేసీఆర్ కు ఆప్తుడైన పల్లా రాజేశ్వర్ రెడ్డి…. ” మెజార్టీ ఉన్నా ఇతర పార్టీల్లోని నేతల్ని ఎందుకు చేర్చుకుంటున్నారని ఓ సారి కేసీఆర్ ను అడిగితే.. పక్క పార్టీల్లో ఉండి కుక్కల్లా ఆరుస్తూంటారని… అదే పార్టీలో చేర్చుకుంటే పిల్లుల్లా ఉంటారని అన్నారని” నేరుగానే చెప్పారు. దీనిపై కామెంట్ చేసినట్లయితే.. ఆర్కే కొత్త పలుకుకు మరింత మైలేజీ వచ్చి ఉండేది