ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఈ వారం కొత్తపలుకులో ఓ ధర్మసందేహాన్ని వ్యక్తం చేశారు. అదేమిటంటే… జగన్మోహన్ రెడ్డిపై ఇన్ని కేసులు.. ఇన్ని ఆరోపణలు ఉంటే… నిశ్చితంగా తాను చేయాలనుకున్నది చేస్తున్నారు.. కానీ.. కేసీఆర్ చుట్టూ మాత్రం దర్యాప్తు సంస్థలు ఎందుకు మూగుతున్నాయి ? అని. కొత్తపలుకులో తాను చెప్పాల్సినదంతా చెప్పిన తర్వాత సందేహం వ్యక్తం చేశారు. నిజానికి ఆయనకు ఈ విషయం తెలియదా అంటే.. మనం అమాయకులం అనుకోవాలి. ఆయనకు తెలుసు. కానీ తెలియనట్లుగా రాశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డితో బీజేపీ అంటకాగుతోంది.. కేసీఆర్‌ను మాత్రం గద్దె దించేసి తాము ఎక్కాలనుకుంటోంది. అక్కడే తేడా వచ్చింది. అందుకే దర్యాప్తు సంస్థలు ఎగబడుతున్నాయని ఆర్కేకూ తెలుసు. కానీ ధైర్యంగా చెప్పలేకపోయారు. పైగా… గుజరాత్ ఎన్నికల తర్వాత మరింతగా వెంట పడతారని కూడా బయటకు కనిపించరని సంబరంతో రాసుకొచ్చారు.
కేసీఆర్ విషయంలో మొదటి నుంచి ఆర్కే కాస్త వ్యతిరేకంగానే రాస్తున్నారు. బీజేపీతో పెట్టుకోవద్దని ఆయన మొదటి నుంచి తన ఆర్టికల్స్ ద్వారా సలహాలిస్తూనే ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఎప్పటికప్పుడు బీజేపీతో పోరాటంలో ముందడుగు వేస్తూనే ఉన్నారు. తన సలహాలు పాటించడం లేదన్న అసంతృప్తో.. లేక తన సుదీర్ఘ కాలపు మిత్రుడు ఇబ్బందుల్లో పడిపోతున్నాడని ఆవేదనో కానీ ప్రతీ సారి అలాంటి సలహాలు మాత్రం మానలేదు. ఈ సారి కూడా పరోక్షంగా ..జగన్ ఎందుకు దిలాసాగా ఉన్నాడో చెప్పడం ద్వారా కేసీఆర్‌కు సందేశం పంపారని అనుకోవచ్చు.
ఈ వారం కొత్త పలుకులో..జగన్ గురించి ఎప్పుడూ చెప్పేవే చెప్పారు ఆర్కే. ఆయతే జగన్.. ఇటీవల ప్రారంభించిన నినాదం.. తననే నమ్మండి అని అడగడం. దీనిపై విశ్లేషించారు. జగన్‌ను ఎందుకు నమ్మాలో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. అంతా మోసం చేసినా అడ్డగోలుగా ఇంకా ప్రజలు నమ్ముతారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆర్కే సూటిగానే ఉన్నారు. ఆయన అభిప్రాయాలకు తగ్గట్లుగానే ప్రతీ రోజూ వార్తా కథనాలు వస్తున్నాయి. వాటినే మరోసారి ఆర్టికల్‌లో చెప్పారు కానీ.. కొత్తగా ఏమీ చెప్పలేకపోయారు.
ఆర్కే సోర్సులు తగ్గిపోయాయో లేకపోతే ఆయనకే్ ఆసక్తి తగ్గిపోయిందో కానీ..ఇటీవలి కాలంలో కొత్త పలుకులో కొత్త విషయాలమీ చెప్పడం లేదు. గతంలో ప్రభుత్వంలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలు అంటూ కొన్ని ఆసక్తికరమైన కబుర్లను రాసుకొచ్చేవారు. జగన్ .. తన తండ్రితో అర్థరాత్రి సమయాల్లో మాట్లాడటం వంటివి ఇలాంటి వాటిలో ఉన్నాయి. అవి నిజమో కాదో.. కానీ నమ్మేవాళ్లు నమ్ముతారు. అలాంటి ఇన్ సైడ్ తన ఆర్టికల్స్‌లో మిస్ కావడం .. రొటీన్ రాజకీయ వ్యాఖ్యలు ఎక్కువ కావడం వల్ల… కొత్తపలుకు ఎక్కువగా పాత పలుకులాగానే ఉంటోంది.