మీడియాలో ఆర్కే అంటే ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ. రాజకీయాల్లో ఆర్కే అంటే మంగళగిరి వైసీపీ ఎంఎల్ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి. కేసుల యుద్ధంలో సిద్ధ హస్తుడైన ఎంఎల్ఎ ఆర్కే తాజా పిటిషన్ ఇప్పుడు మీడియా ఆర్కే సంస్థకు నోటీసు వచ్చేలా చేసింది. ఎపి అసెంబ్లీ కార్యక్రమాల రికార్డింగు ప్రత్యక్ష ప్రసార హక్కులు ఆర్కే కుమారుడైన వేమూరి ఆదిత్య ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ టెలీ కమ్యూనికేషన్స్ సంస్థకు ఏకపక్షంగా కాంట్రాక్టు ఇచ్చారన్నది ఆర్కే ఆరోపణ. షరామామూలుగా ఆర్టిఐ కింద పత్రాలు తెప్చించిన ఆర్కే అందులోని విషయాల ఆధారంగా ఈ పిటిషన్ వేశారట. అసెంబ్లీ ప్రసారాల కాంట్రాక్టు ఇచ్చేందుకు సమయం లేకపోవడం వల్ల స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయం మేరకు ఆదిత్యకు చెందిన అడ్వాన్స్డ్ టెలీ సంస్థకు ఇచ్చినట్టు ప్రభుత్వం తెలియజేసింది. టెండర్లు పిలవకుండా పోటీ లేకుండా ఇలా చేయడం చట్ట విరుద్ధమని ఆర్కే వాదిస్తున్నారు. దాంతో హైకోర్టు ప్రభుత్వానికి ఆ సంస్థకూ కూడా రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ ముఖ్యమంత్రిగా వుండగా పాత్రికేయుడు మధుకు చెందిన ధాత్రి కమ్యూనికేషన్స్ ఈ ప్రసారాలు చూస్తుండేది. వారు ప్రత్యక్షంగా గాకున్నా పరోక్షంగా ఇప్పటికీ తెలంగాణ శాసనసభ ప్రసారాలలో కొంత పాత్ర వహిస్తున్నారు.కాని అయితే అప్పటికి ఇప్పటికీ ప్రసార రేట్లలో చాలా తేడా వుందనేది విమర్శకుల మాట.చాలా కాలంగా ఈ విషయమై వైసీపీ ఫిర్యాదులు చేస్తున్నది. తమ వారికి సంబంధించిన క్లిప్పింగులు మాత్రమే విడుదల చేస్తూ పాలకపక్షం తప్పిదాలు కప్పిపుచ్చుతున్నట్టు కూడా వారి ఆరోపణగా వుంది. ఇప్పుడు హైకోర్టు విచారణకు స్వీకరించింది గనక పూర్తి వివరాలు బయిటకు వస్తాయని భావించాలి. 2018 చివరి వరకూ ఎపి స్పీకర్ ప్రసార హక్కులు ఇచ్చారు గనక ఈ సభ పదవీ కాలం ముగిసిపోతుందని ఎంఎల్ఎ ఆర్కే వ్యాఖ్యానించారు. గతంలోఓటుకు నోటు, సదావర్తి, భూ సేకరణ వంటి విషయాలలో కేసులు వేసి సంచలనం కలిగించిన ఆర్కే ఈ సారి ఎలాటి ప్రభావం చూపిస్తారో …