ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం తెలంగాణ సీఎం కేసీఆర్ ను పూర్తి స్తాయిలో టార్గెట్ చేశారు. అదీ కూడా అలా ఇలా కాదు.. కేసీఆర్ ను ఎలా దెబ్బతీయాలో … పక్కా ప్లాన్ ప్రకారమే టార్గెట్ చేశారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరిస్తున్న కేసీఆర్ అక్కడ చాన్స్ వస్తే ఆయనే సీఎం అవుతారని అన్నారు. మహారాష్ట్ర వాసుల్లో అనుమానాలు పెంచేలా చేశారు. తెలంగాణలో దళితులకు ఎందుకు అధికారం ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన కొత్తలో దళితుడ్ని సీఎం చేయకుండా.. తానే పదవి చేపట్టడానికి కారణం… తెలంగాణ కాపాడుకోవడానికని చెప్పిన సీఎం ఇప్పుడు.. అంతా బాగు చేశానని చెప్పుకుంటున్నారు కాబట్టి పదవి ఎందుకు ఇవ్వరని ఆర్కే ప్రశ్నిస్తున్నారు.
కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయడానికి కేసీఆర్ చేయాల్సినదంతా చేస్తున్నారని ఆర్కేకు క్లారిటీ ఉంది. అందుకే కేటీఆర్ కు పదవి ఇచ్చే అంశంపైనా ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ దళిత సీఎం హామీని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. ఇది ఒక్కటే కాదు.. కేసీఆర్ చెబుతున్న మాటలు.. ఆయన చేసిన చేతల్ని ఆర్కే .. విశ్లేషించారు. ఆర్కే కొత్త పలుకు చదివితే.. కేసీఆర్ ఇంత దారుణమైన రాజకీయాలు చేస్తూ నీతులు ఎలా చెబుతారని ఎవరికైనా డౌట్ వస్తుంది. ఆర్కేకు కావాల్సింది కూడా అదే.
కేసీఆర్ ను ఎన్నుకును తెలంగాణ ప్రజలు పాపం చేశారని పాప ప్రక్షాళన జరగాల్సిందేనని ఆయన అంతిమంగా ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పై ఈ స్థాయిలో ఆర్కే విరుచుకుపడటం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. తన టీవీ చానల్ లో తెలంగాణ ఏర్పడిన తరవాత ప్రజలకు పంగనామాలు పెట్టారని కథనాలు రాయిస్తున్నారు. ప్రసారాలు చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా తానే రంగంలోకి దిగారు. కేసీఆర్ మాయలో ఉన్న తెలంగాణ ప్రజలకు నిజాలు చెబుతున్నట్లు ఈ వారం కొత్తపలుకు మొత్తాన్ని కేటాయించడం….. కేసీఆర్ పై ఆర్కేకు ఉన్న వ్యతిరేకత కు నిదర్శనంగా కనిపిస్తోంది.
గత ఎన్నికలకు ముందు ఆర్కే… మహా కూటమికి వ్యతిరేకంగా.. కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడారు. ఏం చేసినాకేసీఆర్ గెలుస్తారని కూడా చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం… అసలు కేసీఆర్ గెలవకూడదని… ఆయనపై దళిత వర్గాలు.. ఇతర వర్గాలు తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ను సీఎంను చేస్తే.. తెలంగాణ ప్రజలంతా తిరగబడేలా ఆర్కే.. ప్రజల మైండ్ సెట్ ను ట్యూన్ చేస్తున్నారని అనుకోవచ్చంటున్నారు.