మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు… ఆంధ్రాలో తెలుగుదేశంతో బలవంతపు కాపురం చేయాల్సి వస్తున్న భాజపా నాయకులకు మరోసారి ఆగ్రహం పెంచే పరిస్థితి వచ్చింది! ఒక ప్రముఖ దిన పత్రిక నిర్వహించిన సర్వే ఏపీ భాజపా నేతలకు మింగుడు పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సోలోగా బరిలోకి దిగితే 140 సీట్లు దక్కించుకుంటుందనీ, అదే భాజపాతో కలిసి పోటీ చేస్తే ఓ 20 సీట్లు తగ్గుతాయని సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. సదరు సర్వే వచ్చిన దగ్గర నుంచీ భాజపా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట! ఎందుకంటే, ఆ ప్రముఖ దిన పత్రిక పొలిటికల్ అజెండా ఏంటో అందరికీ తెలిసిందే! కాబట్టి, తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా సర్వే తయారు చేసి, కథనాలను వండి వడ్డించిందని భాజపా విమర్శిస్తోంది.
పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే.. ఆ సర్వేపై ఏపీ భాజపా నేతలు బాగా ఓపెన్ అయిపోతున్నారు. ఏపీ భాజపా శాసన సభా పక్షనేత విష్ణుకుమార్ రాజు ఈ సర్వే నేపథ్యంలో చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే. ఈ సర్వేను ముఖ్యమంత్రి నమ్ముతున్నారా లేదా..? ఒకవేళ నమ్మితే వెంటనే ప్రకటిస్తారా లేదా అంటూ ప్రశ్నించారు. అదే విషయాన్ని ఓపెన్‌గా చెప్పేస్తే తమ దారేదో తాము చూసుకుంటామని కూడా విష్ణురాజు చెప్పడం గమనార్హం. అది కిరాయి సర్వే అనీ, డబ్బులు ఇచ్చి రాయించుకున్న రాతలనీ కామెంట్ చేశారు. ఇంతకీ సొమ్ము ఇచ్చింది ఎవరో చెప్పకనే చెప్పినట్టు కదా!
నిజానికి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ఏపీ భాజపా నేతలు అసంతృప్తిగా ఉన్నారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నా.. ఆ క్రెడిట్ భాజపాకి దక్కనీయకుండా చేస్తున్నారనే కడుపుమంట మొదట్నుంచీ ఉంది. కానీ, అసంతృప్తిని అధిష్టానం వరకూ తీసుకెళ్లే పరిస్థితి ఏపీ భాజపా నేతలకు లేదనే చెప్పాలి! ఎందుకంటే, భాజపాలో అత్యంత కీలక నాయకుడే చంద్రబాబుకు మాంచి దోస్తాయే! ఇక, రాష్ట్రంలోని కొద్దిమంది భాజపా నేతలకు చంద్రబాబు ఎప్పుడో పూనేశారు. ఇలాంటి తరుణంలో సొంతంగా ఏపీలో ఎదగాలనుకున్న భాజపా నాయకులకు తెలుగుదేశం పార్టీ పెద్ద అవరోధంగా కనిపించడంలో ఆశ్చర్యమేముంది. పైగా, ఇలాంటి సర్వేల పేరుతో తెలుగుదేశమే భాజపాకి దూరంగా ఉండాలనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీరు కూడా ఆ పార్టీకి ఆగ్రహం తెప్పించేదే కదా! మరి, ఈ అసంతృప్తి ధోరణి మున్ముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. బాటమ్ లైన్ మాత్రం క్లియర్… భాజపాతో చంద్రబాబుకు దోస్తీ అవసరం! స్టార్ మార్క్ ఏంటంటే… ఏపీ భాజపా నేతలకు ఆ దోస్తీ నచ్చకపోయినా..!