రాజకీయాల్లో ప్రత్యర్థి ఎప్పుడూ మేలే చేస్తాడు. ఎందుకంటే అతడు ప్రత్యర్థి నేరుగా తలపడతాడు. అతన్ని గెలవాలని పోరాడతారు. కానీ సపోర్ట్ చేస్తామని ముందుకొచ్చేవారితోనే అసలు ముప్పు ఉంటుంది. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుంది. పక్కనే ఉండి నవ్వుల పాలు చేస్తారు. చేయాల్సినంత డ్యామేజ్ చేస్తారు. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఆంధ్రజ్యోతి గ్రూప్ నుంచి ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. పేపర్, టీవీ చానల్ సంగతేమో కానీ సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి యూట్యూబ్ చానల్ చేసే రచ్చ మాత్రం వేరే వాళ్లు .. టీడీపీని .. చంద్రబాబును ట్రోల్ చేయడానికి కావాల్సినంత సరంజామా మొత్తం అందిస్తున్నారు.
“సింహంలా ఢిల్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు “, “ఉగ్రరూపంతో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న చంద్రబాబు”, “బాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీలో కలవరం”, “రాష్ట్రపతి ఆగ్రహం.. ఏపీలో పాలన మారే చాన్స్”, “ఢిల్లీలో ఉగ్రరూపం చూపించిన చంద్రబాబు వదిలేదే లే” అంటూ సాగిన థంబ్‌నెయిల్స్‌తో సోషల్ మీడియా నింపేశారు. వైసీపీ ట్రోలర్స్‌కు కావాల్సినంత మేతను ఏబీఎన్ ఆఫీసు నుంచే పంపారు. సామాన్యుల్లోనూ ఇంత బిల్డప్ ఎందుకు అన్న చర్చే వవస్తుంది. వైసీపీని ముసుగులో సమర్థించే జర్నలిస్టులకు ఇవి పెద్ద ఆయుధం అయిపోయాయి. విపరీతంగా స్క్రీన్ షాట్లు తీసి.. ఏబీఎన్‌ను విమర్శించకుండా నేరుగా చంద్రబాబుపై తమ అక్కసు చూపించుకుంటున్నారు.
ఏబీఎన్‌కు తెలుగుదేశం మద్దతు చానల్ అనే పేరు ఉంది. కానీ ఎప్పుడూ వారు ఒప్పుకోరు. తాము అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఉంటామని చెబుతారు. కానీ చంద్రబాబుకు ఇస్తున్న అనవసర ఎలివేషన్లతో వారు వైసీపీకి మద్దతుగా మారిపోయారా అన్న అనుమానం చాలా మందికి కలుగుతోంది. ఏబీఎన్ వల్ల వైసీపీకే మేలు కలుగుతోంది కానీ టీడీపీకి కాదని.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
పై వాళ్లను ఆకట్టుకోవడానికి.. తామేదో టీడీపీ మద్దతుదారులం అని చెప్పుకోవడానికి చంద్రబాబు భక్తులం అని చెప్పుకోవడానికి సంస్థలో కొంత మంది ఇలాంటి తెలివి తేటలు ప్రదర్శిస్తూంటారు. వీరి తీరును అంచనా వేయలేని పై స్థాయి వారు.. ప్రోత్సహించడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కానీ అక్కడ యాజమాన్యానికి ఇవేమీ పట్టవు. థంబ్ నెయిల్స్.. వ్యూస్ .. ఇన్‌కం అనే ప్రపచంలో ఉంటారు. ప్రో టీడీపీ చానల్ ఇమేజ్‌తో వారు కావాల్సిన అడ్వాంటేజ్ సంపాదించుకుంటున్నారు. కానీ అసలు డ్యామేజ్ మాత్రం టీడీపీకి అవుతోంది.
విశేషం ఏమిటంటే… ఆ టైటిళ్లు పెట్టే వాళ్లకు అసలు సబ్జెక్ట్ ఉండదని.. కొన్ని సార్లు వాళ్లే బయట పెట్టుకుంటూ ఉంటారు. జరిగింది టీడీపీ ఆఫీస్‌పై దాడి అయితే.. రాష్ట్రపతి భవన్‌పై దాడి జరిగిందని ధంబ్నె యిల్స్ పెట్టేసి ఏబీఎన్ పరువును ఆన్లైన్లో పోగొట్టారు.