పార్టీ వ్యవహారాలపై చంద్రబాబు సమావేశం పెడితే కొంత మంది ఎంపీలు డుమ్మాకొట్టారు. కొంత మంది మంత్రులు కూడా రాలేదు. చంద్రబాబుతో సమావేశం ఉంది అని పిలిస్తే.. ఇతర కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేవారుంటారని టీడీపీలో ఎవరూ అనుకోరు. కానీ ఉన్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం.. ప్రజల్లోకి వెళ్లే అంశంపై చర్చించడానికి చంద్రబాబు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. వారం రోజుల ముందే అందరికీ సమాచారం ఇచ్చారు. అయితే ముఖ్యమైన మీటింగ్ కు మంత్రులు ఎంపీ లు కొంతమంది హాజరు కాలేదు. దీంతో సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎంతో ముఖ్యమైన సమావేశం అని చెప్పినా ఎందుకు ఈ మీటింగ్ కు రాలేదో చెప్పాలని అదేశాలు జారీ చేశారు. కొంత మంది నేతలు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని హాజరు కాలేదు. పార్టీ కన్నా ముఖ్యమైన కార్యక్రమాలా అని చంద్రబాబు మండిపడినట్లుగా తెలుస్తోంది. కూటమి నేతల మధ్య సమన్వయం కూడా జిల్లా మంత్రులు చూసుకోవాలని.. ప్రభుత్వ కార్యక్రమాలు కింది స్థాయి వరకు వెళ్లడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో బాగా ఆక్టీవ్ గా ఉండాలనీ మంత్రులు ఎంపీల కు సిఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై సోషల్ మీడియాలో ఓ రకమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. దాన్ని ఆయన తిప్పికొట్టలేకపోయారు. ఈ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. సోషల్ మీడియాలో మంత్రి జాడే కనిపించడం లేదని.. ఐటీ నిపుణుడివి అయినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని ప్రశ్నించారు. అలాగే మరో మంత్రి ఫరూక్ అసలు సోషల్ మీడియాలోనే కనిపించరు. దీన్ని కూడా ప్రశ్నించి.. కరెక్ట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు.